తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి వరకూ గత పదేళ్ల కాలంలో తమపై అనుచితంగా ప్రవర్తించిన , కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసుల్లో మరీ గీత దాటిన వారిని మాత్రం అరెస్టుల వరకూ తీసుకెళ్లారు. మిగిలిన అధికారులంతా బిందాస్‌గా ప్రాధాన్యత శాఖల్లోనే కొనసాగుతున్నారు. చీఫ్ సెక్రటరి కూడా కేసీఆర్ హయాంలో నియమితులైన వారే.
అయితే ఇటీవలి కాలంలో సెక్రటేరియట్ నుంచి కీలక సమాచారం అంతా బీఆర్ఎస్ చేరుతోంది. నిర్ణయాలు తీసుకోక ముందే ప్రతిపాదనల్లో ఉన్నా కూడా సమాచారం వెళ్తుందన్న సంకేతాలు రావడంతో ముఖ్యమంత్రి జాగ్రత్త పడుతున్నారు. బెటాలియన్ పోలీసులు సెక్రటేరియట్ ముట్టడికి కుట్ర చేశారని దానికి కొంత మంది అధికారులు.. హెచ్వోడీలు సహకరించారన్న ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో రేవంత్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కోసం పని చేస్తారని అనుకుని గతంలో వివాదాస్పద చరిత్ర ఉన్నా సహించానని ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని తెలిసిన తర్వాత సహించాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
తాజాగా సెక్రటేరియట్ హెచ్వోడీలను భారీగా బదిలీ చేస్తున్నారు. కీలక అధికారుల్ని తప్పించి నమ్మకంగా పని చేసేవారిని తెచ్చి పెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీని కూడా మార్చేశారు. బెటాలియన్ పోలీసులు మొత్తం ఓ మాజీ ఐపీఎస్ చెప్పినట్లుగా చేస్తున్నారన్న సంకేతాలు రావడంతో వారిపై ప్రభుత్వం నమ్మకం కోల్పోయింది. అందుకే ఎస్పీఎఫ్కు బాధ్యతలు ఇచ్చారు. ఇలా బీఆర్ఎస్ సర్వీస్ లో ఉన్న అధికారుల్ని శంకరగిరి మాన్యాలకు పంపించేదుకు ప్రభుత్వం సిద్ధమయింది.