బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని సోషల్ మీడియాలో కార్యకర్తలు అడగడంతో ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. దాదాపుగా ఏడాది పాటు పాదయాత్ర సాగే అవకాశం ఉన్నందున 2026లో ఆయన పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రతో మొత్తం ఆయన ఇమేజ్ మారిపోయింది. ట్రోల్ చేసేవారు కూడా ఇప్పుడు లేరు. ఆయన ఒక్క సారిగా ఇమేజ్ పెంచుకోవడమే కాదు పార్టీపైన పట్ట సాధించారు. ప్రతిపక్షంలో ఉండటాన్ని ఓ అద్భుతమైన అవకాశంగా మల్చుకున్నారు. స్టాన్ ఫర్డ్ లో చదువుకుని వచ్చినా తాను లోకల్ పాలిటిక్స్‌లో తీసిపోనని నిరూపించుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బాటలో ప్రతిపక్షంలో ఉన్నా.. తాము తగ్గబోమని నిరూపించాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు.
కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పాత్రలో లేరు. తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్కు పట్టిందల్లా బంగారమే అయింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేవరకూ ఆయన అపరిమితమైన అధికారం చూశారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం పడింది. దానికి పాదయాత్ర ఓ అవకాశంగా భావిస్తున్నారు.