తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలతో కలిసిపోయే విధానం భిన్నంగా ఉంటోంది. గతంలో ఆయన హెడ్ మాస్టర్ లా వ్యవహరించేవారు…కానీ ఇప్పుడు ఆయన స్టైల్ టీ మాస్టర్లా మారిపోయింది. గతంలో పథకం ప్రారంభించి ఉపన్యాసం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా పథకం ప్రారంభించి ఇంటిల్లి పాదితో ముచ్చట్లు చెప్పి భరోసా ఇచ్చి వెళ్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు .. తర్వాత స్వయంగా టీ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.
అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి నేరుగా గ్యాస్ డెలివరీ బాయ్ తో సహా వెళ్లారు చంద్రబాబు. స్వయంగా ఆ గ్యాస్ బండను స్టౌకు బిగింప చేశారు. తర్వాత తానే స్టౌ వెలిగించి టీ పెట్టారు. ఆ ఇంట్లో వాళ్లతో పాటు తనతో పాటు వచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్, ఇతర నేతలకు ఇచ్చారు. చంద్రబాబు టీ కాచిన వీడియో వైరల్ అయింది. ఆయన అన్నింటిలోనూ మాస్టరేనని టీడీపీ నేతలు చెప్పుకున్నారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు ఇలాపేదల ఇంటికి వెళ్తే వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు. మొదట పెన్షన్ల పథకాన్ని ప్రారంభించినప్పుడు ఓ నిరుపేద ఇంట్లోకి వెళ్లారు. తర్వాత అనంతపురం.. కర్నూలు జిల్లాల్లోనూ అలాగే నిరుపేద లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి భరోసా ఇచ్చారు. శ్రీకాకుళంలో అయితే టీ కూడా కాచి ఇచ్చి సరదా కబుర్లు చెప్పారు. గతంలో చంద్రబాబు గంభీరమైన ప్రసంగాలు ఇచ్చి వెళ్లేవారు. కానీ పేదల దగ్గరకు వెళ్లినప్పుడు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఆ కార్యక్రమం అయిపోయాక ఇతర సభ, సమావేశంలో తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు.