తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల్లో ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అంచనా వేయడం కష్టం. రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్ లు చేసే ప్రకటనలకు పొంతన ఉండదు. ఎవరి వైపు మాట్లాడతారో స్పష్టత రాదు. వీరికి ఇప్పుడు కొత్తగా మహేశ్వర్ రెడ్డి తోడయ్యారు. తెలంగాణ శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కించుకున్న ఈయన బీజేపీని చిక్కుల్లో పడేసే ప్రకటనలే చేస్తూంటారు. గతంలో మేఘా గురించి దూకుడు ప్రకటనలు చేసి..మరోసారి అలాంటి ప్రకటనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు అందుకున్నారు.
పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టే చాన్స్ కోల్పోయారు. అయినా ఆయన ఎవరి ఎజెండానో అమలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై పుకార్లు రేపుతున్నారు. రేవంత్ రెడ్డిని హైకమాండ్ దూరం పెడుతోందని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఏడు నెలల నుంచి హైకమాండ్ ను రేవంత్ కలవలేదని అంటున్నారు. అంతేనా రెండు మూడు నెలల్లో సీఎం మార్పు ఉంటుందని ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయని కూడా చెబుతున్నారు.
తన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన చెబుతున్నారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో ఖచ్చితమైన సమాచారం ఉందో లేదో కానీ.. కాంగ్రెస్ లో జరిగే ఖచ్చితమైన సమాచారం ఎవరిచ్చారో ఆయనకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పే ముగ్గురు సీఎం రేసులో ఉన్న నేతల్లో ఒకరు ఇచ్చారా లేకపోతే మరొకరా అన్నది ఆయనకే తెలియాలి. కానీ రేవంత్ రెడ్డి హైకమాండ్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారన్ని బహిరంగ రహస్యం. మూసి విషయంలో , హైడ్రా విషయంలో రాహుల్ గాంధీ ఆయనకే సపోర్టు చేసారని అందరికీ కాంగ్రెస్లో అందరికీ తెలిసిన విషయం.