ఏపీలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక వచ్చింది . విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. నాలుగో తేదీ నుంచి పదకొండో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది. 28వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయనగరం ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన చేరలేదు. అయితే టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పిఆయనపై రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేశారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ టీడీపీ అభ్యర్థుల్ని పోటీ చేయకుండా చేసి అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో సహజంగానే ఆ పార్టీకి మెజార్టీ ఉంది. కానీ గత ఎన్నికల తరవాత సీన్ మారిపోయింది. వైసీపీ క్యాడర్ అంతా టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. బొత్స ఫ్యామిలీ కూడా నిస్సహాయంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఉపఎన్నిక రావడంతో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖలో ఉపఎన్నిక జరిగితేనే బొత్సకు బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన కుటుంబానికే జగన్ టిక్కెట్ ఆఫర్ చేస్తారని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే పెడతారని చెబుతున్నారు.
టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. విశాఖ స్థానిక సంస్థల విషయంలో టీడీపీ నేతలు మెజార్టీ ఓటర్లు ఉన్నారని భరోసా ఇవ్వలేకపోవడంతో బొత్సకు వాకోవర్ లభించింది. విజయనగరం జిల్లా నేతలు ఏం చేస్తారన్నదానిపై చర్చ నడుస్తోంది. అనర్హతా వేటు పడిన ఇందుకూరి రఘురాజుకే టీడీపీ చాన్సు ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. లోకేష్ అమెరికా నుంచి వచ్చాక… ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.