పాదయాత్ర చేయబోతున్నానని కేటీఆర్ ప్రకటించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ లో చేసిన చాట్లో ఆయన ఓ నెటిజన్ ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు. నిజానికి ఆ ట్వీట్ ను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ ఆరోగ్యం గురించి చెప్పిన మాటలతో పాటు ఓ సందర్భంలో తానుు రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని చేసిన ప్రకటన మాత్రం ఎక్కువ మంది మీడియా కవర్ చేశారు. ఆయా మీడియా, సోషల్ మీడియా సంస్థలు అవే కోరుకున్నాయేమో తెలియదు. కామెడీ ఏమిటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు.
తాము కోరుకున్న అంశం హైలెట్ కాకపోవడంతో తర్వాత రోజు అంటే శుక్రవారం రోజున బీఆర్ఎస్ మీడియా విభాగం దాన్నే హైలెట్ చేస్తూ మీడియాకు సమాచారం పంపింది. దాంతో కేటీఆర్ పాదయాత్ర అంటూ హడావుడి ప్రారంభమయింది. ఎప్పటి నుంచి చేస్తారన్నది తెలియదు కానీ చర్చ మాత్రం కేటీఆర్ ప్రారంభించగలిగారు. విమర్శించేవారు విమర్శిస్తున్నారు. స్వాగతించే వాళ్లు స్వాగతిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ పాదయాత్రపై భిన్నమైన చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డికి సమ ఉజ్జీగా వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో ఉండాలంటే పాదయాత్ర తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఏపీలో నారా లోకేష్ చేసిన పాదయాత్రకు లభించిన మద్దతు.. ఆ తర్వాత మారిపోయిన ఆయన ఇమేజ్ వంటివి బీఆర్ఎస్ వ్యూహకర్తలు పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు. రేవంత్ కు పోటీగా కేసీఆర్ మాత్రమే ఉన్నారు. ఆయన బయటకు వస్తే కేటీఆర్ ఆయన నీడలోనే ఉండాల్సి ఉంటుంది . అలా వచ్చినా సరే పాదయాత్ర ద్వారా రేవంత్ కు తాను సమ ఉజ్జీనని నిరూపించుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు.
చిట్టినాయుడు అని రేవంత్ ను ఎంత విమర్శించినా రేవంత్ రేంజ్ ను బీఆర్ఎస్ తక్కువ అంచనా వేయలేదు. ఎక్కడో ఆకాశంలో ఉన్న బీఆర్ఎస్ ను నేల మీద పడేశాడు. మళ్లీ లేస్తుందా లేదా అన్న అనుమానాల్ని కల్పించారు. నామరూపాల్లేకుండా చేస్తానని హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో బీఆర్ఎస్కు మరో మార్గం లేకుండా పోతోంది.