హనుమంతుడ్ని గ్రాఫిక్స్‌లో చూపించేసి, ‘హనుమాన్’ సినిమా తీసేశాడు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి సినిమాల్లో అది బ్లాక్‌బస్టర్. ఇప్పుడు ‘జై హనుమాన్’ పనులు కూడా మొదలెట్టేశాడు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని హనుమంతుడిగా చూపిస్తున్నాడు. అయితే ఈసారి రాముడి పాత్రకూ చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాముడు – హనుమంతుడు మధ్య జరిగిన కొన్ని సంఘటనల్ని తెరపై చూపించాల్సిన అవసరం ‘జై హనుమాన్’ కథ కల్పించింది. దాంతో రాముడి పాత్రకు ఎవర్ని ఎంచుకొంటాడన్న ఆసక్తి మొదలైంది.
మైథాలజీ టచ్ ఉన్న కథలకు దేశం మొత్తమ్మీద మంచి ఆదరణ లభిస్తోంది. ‘హనుమాన్’ పాన్ ఇండియా స్థాయిలో విజయకేతనం ఎగరేయ్యడానికి కారణం అదే. `జై హనుమాన్`కీ అదే బలం. ఈ కథలో మైథాలజీ కి పెద్ద పీట వేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. రాముడికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు రాముడిగా ఎవర్ని చూపించాలన్న విషయంలో ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. రాముడి పాత్ర పోషించడం అందరి వల్లా సాధ్యం కాదు. స్టార్ ఇమేజ్ తప్పనిసరి. తీసుకొంటే పేరున్న స్టార్‌ని తీసుకోవాలి. లేదంటే… హనుమాన్ లో హనుమంతుడ్ని గ్రాఫిక్స్ లో చూపించిన ట్రిక్ ఫాలో అవ్వాలి. ‘కల్కి’లో కూడా ఇదే జరిగింది. శ్రీకృష్ణుడి పాత్రని అలానే చూపించారు. ఏఐ అందుబాటులో ఉంది కాబట్టి, రాముడి పాత్రని ఏఐలో సృష్టించొచ్చు. అయితే అంత ఇంపాక్టబుల్ గా ఉంటుందా, లేదా? అనేది చూసుకోవాలి. హనుమాన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రాముడి పాత్రలో గెస్ట్ ఎప్పీరియన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగానే ఉంటారు. మరి ప్రశాంత్ వర్మ మైండ్ లో ఏముందో?