జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో శనివారం ఉగ్రవాదుల దాడిలో 8మంది జవాన్లు మృతి చెందారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పాంపోర్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసి సైనికులపై దాడి చేశారు. ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడికి తామే చేశామని లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది. గత 6 నెలలో ఇటువంటి సంఘటనలు చాలాసార్లు జరిగినా ఉగ్రవాదుల చేతిలో ఒకేసారి ఇంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం ఇదే మొదటిసారి.
మూడు రోజుల క్రితమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ తో మళ్ళీ స్నేహసంబంధాలు పునరుద్దరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు తన రాష్ట్రంలోనే తరచూ ఈవిధంగా దాడులు చేస్తున్నా కూడా ఆమె పాకిస్తాన్ తో స్నేహాన్నే కోరుకోవడం విశేషం. ఉగ్రవాదుల దాడులలో సైనికులు మరణించినప్పుడు ఆమె నోరు మెదపరు. మరణించిన సైనికుల, వారి కుటుంబాల పట్ల సానుభూతిగా నాలుగు ముక్కలు మాట్లాడరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జాతీయవాదంపై పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే భాజపా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి ముఫ్తీ మహబూబాతో అంటకాగుతూ ఆమె ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కనుక రాష్ట్ర భాజపా నేతలు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటారు.
కారణాలు ఏవయితేనేమి, కేంద్రప్రభుత్వం కూడా ఇప్పుడు పఠాన్ కోట్ దాడుల గురించి మాట్లాడటం లేదు. పాక్ పై ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. అంత పెద్దదాడిని కూడా భారత్ కేవలం ఆరునెలలలో మరిచిపోగలిగింది కనుకనే చరిత్ర పునరావృతం అవుతోందని చెప్పక తప్పదు. బహుశః ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వం ఒక ఖండన ప్రకటనతో సరిపెట్టవచ్చు. దేశప్రజల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వీర జవాన్లను ఇది అవమానించడంగానే భావించవలసి ఉంటుంది.