పొలిటికల్ లీడర్‌గా మారిన స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తాను ఎంత ఫీజు తీసుకునేవాడినో ఆవేశంలో చెప్పేశారు. ఒక్క ఎలక్షన్‌కు సలహాలివ్వడానికి మినిమం అంటే మినిమం రూ. వంద కోట్లు తీసుకునేవారట. బీహార్ ఉపఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టారు. అయితే ఆయన పార్టీకి డబ్బుల్లేవని ఇతరులు విమర్శిస్తున్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్‌కు రోషం వచ్చేసింది. తాను ఒక్క పార్టీకి సలహాలిస్తే మినిమం వంద కోట్లు తీసుకుంటానని ప్రకటించారు. ఒక్క పార్టీకి పనిచేస్తే రెండేళ్ల పాటు తాను రాజకీయ ప్రచారం చేసుకోవడానికి సరిపోతాయని చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ కిషోర్ దేశంలో నెంబర్ వన్ స్ట్రాటజిస్ట్. అందులో సందేహం లేదు. ఆయన స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. కానీ బెంగాల్, తమిళనాడుల్లో టీఎంసీ, డీఎంకేలకు పని చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆయన స్థాపించిన ఐ ప్యాక్ నుంచి కూడా బయటకు వచ్చారు. బీహార్‌లో జన సురాజ్ అనే పార్టీ పెట్టుకున్నారు. పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని నిలిపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఆయన ఇలా తనకు బోలెడు డబ్బులొస్తాయని చెప్పుకొస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన టీం కొంత కాలం పని చేసింది. ఆ సమయంలో కేసీఆర్ .. ప్రశాంత్ కిషోర్ తనకు మంచి మిత్రుడని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తమ పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు. కానీ అదంతా ఉత్తదేనని.. తన సేవలు కావాలంటే కనీసం రూ. వంద కోట్లు ఉండాల్సిందేనని పీకే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్నారు కాబట్టి స్ట్రాటజిస్టుగా పని చేయలేరు.. ఆయనకు ఆదాయం రాదు. ఆయన లేడు కాబట్టి ఐ ప్యాక్ కూడా అడ్రస్ లేకుండా పోయింది.