రుషికొండ ప్యాలెస్‌ను చూసేందుకు ప్రజలను అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వారు చూసిన తర్వాత వారి అభిప్రాయాలను బట్టి ఎలా ఉపయోగించుకోవాలన్నది నిర్ణయించనున్నారు. జగన్ రెడ్డి రాచరిక మనస్థత్వానికి అనుగుణంగా కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆయన ప్యాలెస్‌లోని ఏడు భవనాలను చూసేందుకు దాదాపు గంట సమయం పట్టింది. అధికారులను ఆ భవనం నిర్మాణానికి చేసిన పర్యావరణ విధ్వంసం దగ్గర నుంచి ఖర్చు వరకూ మొత్తం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
టూరిజం పేరుతో కట్టారని కానీ ఇది ఏ విధంగానూ పర్యాటకంగా ఉపయోగించడానికి కూడా అవకాశం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ ఎస్కోబార్‌లా ప్రజాధనంతో జల్సాలు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ మొత్తానికి ఐదేళ్లలో నాలుగు వందల కోట్లు కూడా ఖర్చ పెట్టలేదని కానీ ఆ ఒక్క ఇంటికి మాత్రం నాలుగు వందల ముఫ్పై కోట్లకుపైగా ఖర్చు పెట్టారని చంద్రబాబు తెలిపారు. రాజధాని పేరుతో ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు పట్టించుకోరని అనుకున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో బాధ్యత లేనిపాలకుడు ఉంటే ఇలాంటివే జరుగుతాయన్నారు. ప్రజలకు కూడా ఈ దుర్వినియోగం గురించి తెలియాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్యాలెస్ కు అయిన ఖర్చుతో పాటు ప్రతి వ్యవహారంపై వివరాలను మీడియాకు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. కోర్టులు సహా దేశంలోని ఏ వ్యవస్థనూ లెక్క చేయకుండా ఈ భవనాలను నిర్మించడంలోనే జగన్ రెడ్డి బరితెగింపు ఉందన్నారు. కట్టినంత వరకూ ఎవర్నీ లోపలికి రానివ్వలేదని కానీ తాము ప్రజలకు చూపిస్తామని చంద్రబాబు తెలిపారు.
సీఎం అయిన తర్వాత చంద్రబాబు తొలి సారి ప్యాలెస్ ను పరిశీలించారు. వాటిని ఎలా ఉపయోగించాలో దేనికి ఉపయోగించాలో ప్రభుత్వానికీ అర్థం కావడం లేదు.