జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన తరపున సనాతన ధర్మ పరిరక్షణకు “నారసింహ వారాహి గణం” ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గణం సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి ఉన్న భజరంగ్ దళ్ లాగా.. జనసేనకు ఈ “నారసింహ వారాహి గణం” ఉంటుందని అనుకోవచ్చు.
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ హిందూత్వం, సనాతన ధర్మంపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. హిందూత్వాన్ని కించపర్చడాన్ని సెక్యూలర్ వాదంగా చెప్పుకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. హిందూత్వాన్ని మాత్రమే ఎందుకు కించ పరుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అన్ని మతాల పట్ల సమభావంతో ఉండాలని చెబుతున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి పవన్ పూర్తి స్థాయి సనాతన ధర్మ రక్షణ వాదిగా మారిపోయారు.
“నారసింహ వారాహి గణం” ఏర్పాటు ఉద్దేశాలను ఇంకా పవన్ ప్రకటించలేదు. గణాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంశం రాజకీయాలను కలకలం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఉత్తరాదిన హాట్ టాపిక్ అయ్యారు. తమిళనాడులోనూ ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ఈ “నారసింహ వారాహి గణం”ను తమిళనాడుకూ విస్తరిస్తే .. పవన్ పక్కా ప్లాన్ తోనే ఉన్నారని అనుకోవచ్చు.