ఇటీవల తమిళనాడు శాసనసభకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష డిఎంకె పార్టీతో ఎన్నికల పొత్తులు పట్టుకొని 41 స్థానాలకి పోటీ చేయగా కేవలం 8 స్థానాలు మాత్రమే గెలుచుకొంది. కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈవికెఎస్ ఇలంగోవాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాజినమాని ఇంకా అంగీకరించలేదని సమాచారం.
నిజానికి ఆ ఎన్నికలలో డిఎంకె పార్టీకి చాలా తక్కువ తేడాతో పరాజయం పాలయింది. 232 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అధికార అన్నాడిఎంకె పార్టీ 134 సీట్లు గెలుచుకోగా, కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె 89 సీట్లు గెలుచుకొంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినవారిలో సగం మంది గెలిచినా నేడు రాష్ట్రంలో డిఎంకె పార్టీయే అధికారంలో ఉండేది. అంటే కాంగ్రెస్ కారణంగానే డిఎంకె పార్టీ ఓడిపోయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ఒక చారిత్రిక తప్పిదంగా డిఎంకె చరిత్రలో మిగిలిపోతుంది.
ఈ ఓటమి వలన కాంగ్రెస్ పార్టీకి కొత్తగా కలిగే నష్టమేమీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే, తమిళనాడులో అది స్వశక్తితో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. ప్రతీసారి ఏదో ఒక ద్రవిడ పార్టీకి తోకగా పోటీ చేయవలసిందే. ఇప్పడు కూడా అదే చేసింది. డిఎంకె అధినేతపై తీవ్ర ఒత్తిడి చేసి 41 స్థానాలు సంపాదించుకోగలిగింది కానీ కేవలం 8 స్థానాలలోనే గెలవగలిగింది. రాష్ట్రంలో దానికెంత బలం ఉందో తెలుసుకోవడానికి అదే చక్కటి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ తను మునుగిపోతూ, జీవితంలో చివరిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకొన్న కరుణానిధిని, ఆయన వారసులుగా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడిన ఆయన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ లని కూడా ముంచేసింది. ఆ పార్టీని నట్టేట ముంచిన ఈవికెఎస్ ఇలంగోవాన్ రాజీనామాని కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించవచ్చు లేదా ఆయననే కొనసాగించవచ్చు కానీ డిఎంకెకి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆ పెద్దాయన దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు.