ట్రిగ్గర్ నొక్కేశామని ఇక పేలడమే తరువాయి అన్నట్లుగా సియోల్ నుంచి బీఆర్ఎస్పై బాంబులు వేస్తున్నామని ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. అటు బీజేపీ నేతలు ఇటు మీడియా కూడా ఆయన కనిపిస్తే బాంబులు ఎక్కడ సార్ అని అడుగుతున్నారు. ఆయన చిరాకు పడుతున్నారు. అలా అడగడాన్ని ఆయన టీజింగ్ చేయడం అనుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు సమయానుకూలంగా పేలడం మాత్రం ఖాయమని ఆయన అంటున్నారు.
పొంగులేటి హడావుడిగా చేసిన ప్రకటనతో నిజంగానే ఏదో చేయబోతున్నారని అనుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి రూ. యాభై ఐదు కోట్ల గోల్ మాల్, కాళేశ్వరం విషయంలో ఇంజినీర్లు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు మొత్తం కేసీఆర్, హరీషే చూసుకున్నారని తమ పాత్ర లేదని వాంగ్మూలం ఇవ్వడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. పెద్ద పెద్ద బాంబులు రెడీ చేశారని అనుకున్నారు. అయితే ఫామ్ హౌస్ లో జరిగిన సీమ టపాకాయ పేలుడుతోనే ఈ దీపావళి ముగిసింది. ఇంకా చాలా ఉంటాయని కేటీఆర్ ఆందోళనగా ట్వీట్ పెట్టినా ఏమీ జరగలేదు.
కులగణన అంశం పక్కకు పోకూడదని ప్రస్తుతానికి పక్కన పెట్టామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదో తేదీన రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. కులగణనకు మంచి ప్రాధాన్యం రావాలని ప్రజల్లో చర్చ జరగాలని రాహుల్ కోరుకుంటున్నారు. అందుకే ఈ అంశం నుంచి టాపిక్ డైవర్ట్ కాకుండా ప్రస్తుతానికి బాంబుల్ని పక్కన పెట్టారని.. తర్వాత అయినా ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.