ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈయనను ఎప్పుడు అధ్యక్షుడిగా నియమించారో వైసీపీ నేతలకు అర్థం కాలేదు. సెప్టెంబర్లో జిల్లాల అధ్యక్షుల్ని మార్పు చేసినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి అయితేనే గాడిలో పెట్టగలరని ఆయన పేరును ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఆయన ఇప్పటి వరకూ బాధ్యతలు తీసుకోలేదు. తీసుకున్నారో లేదో ప్రకటించారు కాబట్టి ఆయననే అధ్యక్షుడని అనుకుంటూ వచ్చారు.
అయితే హఠాత్తుగా ఆయనకు బదులుగా భూమన కరుణాకర్ రెడ్డి హంగామా చేస్తూ ఆదివారం ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డికానీ హాజరు కాలేదు. కానీ పెద్దిరెడ్డి సందేశం పంపించారంటూ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన అనారోగ్య కారణాలతో రాలేదని చెబుతున్నారు. కానీ వైసీపీలో ఏదో జరుగుతోందని అందరికీ అర్థమయింది. భూమన ప్రమాణ స్వీకరానికి రోజా లాంటి నేతలు వచ్చి పెద్ద పెద్ద మాటలు యథావిధిగా మాట్లాడారు.
పెద్దిరెడ్డిని,. ఆయన కుమారుడ్ని నాలుగు జిల్లాలకు ఇంచార్జులుగా నియమించారు. వారు ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలను పట్టించుకుంటున్నట్లుగా లేదు. చుట్టుముడుతున్న కేసులతో వారు కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికైతే పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనేందుకు సిద్ధంగా లేరని అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు కూడా ఆయన సుముఖత చూపలేదని అంటున్నారు.