వైసీపీ హయాంలో ఇష్టారీతిన తప్పుడు కేసులు టీడీపీ నేతల్ని వేధించే విభాగంగా మారిన సీఐడీ నడిపించిన ఇద్దరిలో ఒకరు సంజయ్. ఇలా చేసినందుకు వారికి అధికారికంగా డబ్బుులు దోచి పెట్టారు. ఆ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎస్సీ,ఎస్టీ చట్టంపై అవగాహన సమావేశాలు పెడతానంటూ ఆయన కోటికిపైగా డబ్బులు డ్రా చేసుకున్నారు. కానీ మూడు లక్షలే ఖర్చు పెట్టారు. మిగతా అంతా దొంగ బిల్లులు పెట్టుకుని కొట్టేశారు. విజిలెన్స్ విచారణలో బయటపడటంతో ఇప్పుడు ఆయన కేసుల పాలై… ఉన్న సర్వీసు కాలంలో జైలుకెళ్లడమో లేకపోతే విచారణ ఎదుర్కోవడమో జరుగుతుంది. ఇక పోస్టింగ్ అనే ఆశలు లేనట్లే.
ఎస్సీ ,ఎస్టీలను అడ్డం పెట్టుకుని ఆయన ఇలా ప్రజాధనం దోచుకోవడంపై సివిల్ సర్వీస్ అధికారుల్లోనే అసహ్యం వ్యక్తమవుతోంది. నిజానికి ఆయన చాలా కుత్సిత మనస్థత్వం ఉన్న అధికారి అని ప్రచారం ఉంది. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ అని అధికార వర్గాలు బహిరంగంగానే చెబుతూంటాయి. అలాంటి అధికారి ఓ సారి పోలీసు బదిలీల్లో లంచాలు తీసుకుని దొరికిపోవడంతో ఆ నివేదికను అడ్డంపెట్టుకుని ఆయనతో రాజకీయంగా తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు గతపెద్దలు. ప్రతిఫలంగా కొంత సొమ్ము దోపిడీకి అవకాశం ఇచ్చారు. ఇదే చాలని అనుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీలకు చట్టంపై అవగాహన కల్పిస్తానని చెప్పి డబ్బులు డ్రా చేసుకుని పెద్ద స్కామ్ చేశారు.
సంజయ్ కు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోస్టింగ్ లేదు. ఇస్తారని కూడా ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఆయనను అలా వదిలేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి ఎంత మంది టీడీపీ నేతల్ని వేధించారో లెక్కే లేదు. తప్పుడు డాక్యుమెంట్లు కూడా తయారు చేశారు. ఇలాంటి వాటన్నింటికీ సరైన శిక్ష పడాల్సి ఉంది. ఇలాంటి వారిని వదిలేస్తే సివిల్ సర్వీస్ అధికారులు తాము ఏం చేసినా చెల్లుతుందనుకునే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది.