కులగణనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టపరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఐదో తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కులగణనపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించి వారికి జనాభా దామాషా పద్దతిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కులగణన చేపడుతున్నట్లుగా చెబుతున్నారు.
కానీ ఈ కులగణన అనేది చట్టబద్దంగా కాదని పూర్తిగా రాజకీయం కోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి . గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇలా కులగణన చేయించారు. ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. కానీ న్యాయస్థానం కొట్టేసింది. దాన్ని ఆయన సమర్థించుకోలేకపోయారు. బీజేపీ మాత్రం కులగణనకు వ్యతిరేకంగా ఉంది. కులగణన వద్ంటోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన వాదన వినిపిస్తున్నారు. బీసీ వర్గాలను దగ్గర తీయడానికి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాల్లో మద్దతు తక్కువే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. బీసీలు కూడా మద్దతుగా నిలిస్తే పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్నారు. రాహుల్ ఆలోచనల్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయంగా మైనస్లు కూడా ఉన్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నా… వాటిని పరిష్కరించుకుందామని ముందుకెళ్తున్నారు. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి.