ఇది వరకు పక్క భాషలో హిట్టయిన సినిమాని ఎంత రేటయినా తెలుగు నిర్మాతలు కొనేసేవారు. మన దగ్గర కొత్త కథలు పుట్టడానికి బద్దకించడమే అందుకు కారణం. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. నవతరం దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. దాంతో తెలుగు కథలెక్కువగా రీమేక్ రూపంలో ఇతర భాషల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు జెంటిల్మన్ సినిమాపై తమిళ, కన్నడ సినీ వర్గాల దృష్టి పడింది. నాని – ఇంద్ర గంటి మోహన కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. గతవారం విడుదలైన హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.
మరీ కొత్త కథేం కాకపోయినా, స్క్రీన్ ప్లేలో ఉన్న గమ్మత్తు, ట్విస్టూ చూసి తమిళ, కన్నడ దర్శకులు ముచ్చట పడుతున్నారు. అందుకే ఈ సినిమాని రీమేక్ చేసుకోవడానికి ముందుకొచ్చారట. ఎంత రేటయినా పర్వాలేదు.. హక్కులు మాకే కావాలని ఆరాటపడుతున్నార్ట. రెండు భాషల్లోనూ కలిపి రీమేక్ రైట్స్ రూపంలో కనీసం రూ.3 కోట్లయినా వస్తాయని నిర్మాత లెక్కలు వేసుకొంటున్నారు. టేబుల్ ప్రాఫిట్ గా ముందే లాభాల బాట పట్టిన ఈ సినిమాకి ఇది బోనస్ అనుకోవొచ్చేమో?