ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పుతున్నారు. ఆయన కాంగ్రెస్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. కులగణన విషయంలో అడ్వాంటేంజ్ తీసుకుని బీసీల్లో మద్దతు పెంచుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న చేయకూడని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. తాజాగా నల్లగొండలో ఓ సమావేశం పెట్టి పొంగులేటిని .. మంత్రుల్ని బూతులు తిట్టా… కొడకల్లారా అంటూ రెచ్చిపోయారు. ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఆయన ఇలాగే వ్యవహరించడంతో ఎన్నో సార్లు దాడులకు గురయ్యారు. ఎన్నో బ్లాక్ మెయిలింగ్ కేసులు పడ్డాయి. అతి కష్టం మీద బీజేపీలో చేరుతానన్న ఒప్పందం మీద న్యాయ సాయం పొంది ఎప్పటికో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం బీజేపీలో చేరారు కానీ ఎక్కువ రోజులు అందులో లేరు. మళ్లీ బయటకు వచ్చారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని ఆ పార్టీలో చేరారు. మల్కాజిగిరి సహా ఎక్కడ టిక్కెట్ దొరికితే అక్కడ పోటీ చేద్దామనుకున్నారు. చివరికి ఎమ్మెల్సీ దక్కింది.
తన కోరిక తీరినా ఆయన కాంగ్రెస్ పార్టీ తనను నెత్తి మీద కూర్చోబెట్టుకోలేదని అనుకుంటున్నారేమో కానీ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఈ సారి ఎమ్మెల్సీని చేసిన కాంగ్రెస్ పార్టీపైనే రెచ్చిపోతున్నారు. ఆయన తరహా మనస్థత్వం ఉన్న వారిని ప్రోత్సహిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని కాంగ్రెస్కు మల్లన్న గుణపాఠం నేర్పుతున్నట్లవుతోందని… ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఇతర నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు.