విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తనపై అనర్హతా వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ కారణంగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు కూడా తక్కువేనని భావిస్తున్నారు.
మరో వైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ఉంది. ఈ కారణంగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. మరి విజయనగరంలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆ పార్టీ జిల్లా నేతలు కూడా ఏమీ అనుకున్నారో తెలియడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది.
మొత్తం ఓటర్లు 753 మంది ఉన్నారు. వీరిలో వైసీపీకి 548 మంది, టీడీపీకి 156, జనసేనకు 13 మంది ఉన్నారు. స్వతంత్రులు 14 మంది ఉండగా ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు 22 మంది ఉన్నారు. ఎలా చూసినా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీలో చేరిపోయారు. బొత్స కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసే అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు రఘురాజుకే మళ్లీ టీడీపీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన వర్గం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయింది.
వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా అది బొత్స కుటుంబం నుంచే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ వైసీపీ కూడా అభ్యర్థిపై ఎలాంటి కసరత్తులు చేయలేకపోయింది. విజయనగరం జిల్లా కాబట్టి బొత్స మాటే నెగ్గుతుంది. ఆయన ఇప్పుడు అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నారు.