అక్టోబర్ చివరి వారంలో దీపావళి సినిమాల సందడి నెలకొంది. లక్కీ భాస్కర్, క, అమరన్ ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. నవంబర్ మొదటి వారం కూడా ఆ సినిమాల సందడే కొనసాగుతోంది.
నవంబర్ రెండోవారం చిన్న, మీడియం సినిమాల వస్తున్నాయి. హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. లవ్ స్టొరీతో కూడిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ‘స్వామిరారా’, ‘కేశవ’ సినిమాలు వచ్చాయి. ఇందులో స్వామిరారా నిఖిల్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. కేశవ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ కొత్త సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో అనేది ఆసక్తికరం.
‘బాహుబలి’లో సేతుపతి పాత్రలో పోషించి నటుడు రాకేశ్ వర్రే. ఆయన హీరోగా దర్శకుడు విరించి వర్మ రూపొందిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ‘జాతర’ అనే ఓ చిన్న సినిమాతో వస్తున్నాడు సతీశ్‌బాబు రాటకొండ. చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ధూం ధాం’. ఓ గ్రామీణ యువకుడి కథతో రూపొందిన సినిమా ‘ఈసారైనా?!’. వీటితో పాటు ‘రహస్యం ఇదం జగత్’ అనే చిన్న సినిమా ఈ నెల 8న బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి.
నవంబర్ మూడో వారం రసవత్తరంగా మారింది. సూర్య హీరోగా శివ రూపొందించిన ‘కంగువా’. భారీ అంచనాలు వున్న సినిమా ఇది. ఇప్పటికే ట్రైలర్ చాలా బజ్ క్రియేట్ చేసింది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా కరుణకుమార్ తెరకెక్కించిన ‘మట్కా’. ఇదొక పిరియాడిక్ డ్రామా. వరుణ్ తేజ్ గెటప్స్, క్యారెక్టర్ కొత్తగా వున్నాయి. వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు ఈ నెల 14న విడుదల కానున్నాయి. వీటితోపాటు.. అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ అదే రోజు రిలీజ్ కానుంది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కథ ఇవ్వడం మరో విశేషం.
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’తో వస్తున్నాడు. రవితేజ ముళ్లపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విశ్వక్ మార్క్ సినిమా ఇది. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన మూవీ జీబ్రా. నవీన్ చంద్ర క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘లెవన్’. కొత్త కుర్రాళ్ళు హర్ష నర్రా, సందీప్ సరోజ్ ప్రధాన పాత్రల్లో విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన ‘రోటి కపడా రొమాన్స్’. ఈ సినిమాలన్నీ ఈ నెల22 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొత్తానికి చిన్న, మీడియా, పెద్ద సినిమాల త్రిముఖ పోటీతో నవంబర్ బాక్సాఫీసు సందడిగా కనిపిస్తోంది. డిసెంబరులో `పుష్ష 2`తో పాటుగా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు నెలల్లో కొన్ని హిట్లు పడితే.. 2024ని కాస్త గౌరవ ప్రదంగా ముగించొచ్చు.