తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ తో అలరిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం. కల్కి (గెస్ట్ రోల్) లేటెస్ట్ గా లక్కీ భాస్కర్. ఈ నాలుగు కూడా సూపర్ హిట్లు. మహానటి, సీతారామం అయితే క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. ప్రతి సినిమాలో తన నటన, కథని ఎంచుకునే తీరు ప్రత్యేక ఆకర్షణగా ప్రేక్షకుల్ని మురిపించింది.
నిజానికి ఇతర భాషల హీరోలు తెలుగులో నేరుగా సినిమా చేయడానికి భయపడుతుంటారు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం వారిలో ఉంటుంది. సూర్య, కార్తీ, విక్రమ్.. ఇలా చాలామంది హీరోలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ నేరుగా తెలుగులో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. కార్తీక్ నాగార్జునతో కలిసి చేసిన ఊపిరి సినిమా తప్పితే నేరుగా ఇంకో సినిమా తీయలేదు.
ఇక సూర్య విక్రమ్ తెలుగు మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా మంచి స్క్రిప్ట్ దొరికితే చేస్తామని చెప్పడమే తప్పితే ఆ దిశగా ఎప్పుడు ముందుకు కదల్లేదు. దీనికి కారణం ఇక్కడ సినిమా తీస్తే తమ భాష ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక భయం వాళ్ళని వెంటాడుతోంది.
అయితే దుల్కర్ సల్మాన్ ఈ భయాన్ని జయించాడు. దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన సినిమాలు, ఇక్కడ ఆడియన్స్ తో పాటు మలయాళం లో కూడా అంతే ఆదరణ పొందుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ వసూళ్లు చూసుకుంటే తెలుగుకి ధీటుగా మలయాళం లో కూడా వసూలు చేస్తుంది.
మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రేక్షకులు ఎక్కడైనా ఆదరిస్తారనే ప్రాథమిక సూత్రాన్ని రుజువు చేశాడు దుల్కర్. రెండు భాషల్లో క్రేజ్ ఉన్న హీరోలు ఏ భాషలో సినిమా చేసి విజయం సాధించవచ్చని నిరూపించాడు. మరి దుల్కర్ చూపిన ఈ దారిలో ఎంతమంది హీరోలు పయనిస్తారో చూడాలి.