పరీక్ష హాలుకు పోవాల్సిన విద్యార్థి పత్తా లేకుండా పోయినట్టు, ఆ మధ్య పార్లమెంటు సమావేశాల సమయంలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జాడ లేకుండా పోయారు. అయ్యయ్యో ఏమయ్యారా అని అభిమానులు కంగారు పడుతుంటే తల్లి సోనియా గాంధీ అసలు విషయం చెప్పారు. ఆయన ఆత్మ పరిశీలన కోసం సెలవు పెట్టి వెళ్లారని, ఎవరూ కంగారు పడవద్దని చెప్పారు. అలా వెళ్లడం వెళ్లడం రెండు నెలలు ఆయన సుదీర్ఘ ఆత్మ పరిశీలన చేసుకున్నారు. సుమారు అరవై రోజులకు తిరిగి జనంలోకి వచ్చారు.
ఈ రెండు నెలలూ ఎక్కడికి వెళ్లారనేది అధికారికంగా సస్పెన్స్. అయినా ఆయన థాయిలాండ్ వెళ్లారంటూ, మీడియాలో టికెట్ల దృశ్యాలను కూడా ప్రసారం చేశారు. అవి నిజమో కాదోగానీ, విపాసన యోగా ద్వారా ఆయన దృఢచిత్తాన్ని పరిణతిని సాధించారని కాంగ్రెస్ వారు చెప్పుకున్నారు. ఆయన గతంలో కంటే సమర్థంగా పార్టీని నడిపిస్తారని ప్రకటనలు చేశారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఆయన పార్టీ ఎంపీలను నడుపుతున్న తీరును చూస్తే, విపాసన యోగ ప్రభావం పూర్తిగా కలిగినట్టు కనిపించదు.
లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని వ్యూహాన్ని పన్నిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకాకిగా మారుతోంది. సుష్మా స్వరాజ్, వసుంధర రాజెతో పాటు వ్యాపం వ్యవహారంలో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసే వరకూ పార్లమెంటును నడవనిచ్చేది లేదని రాహుల్ గాంధీ ప్రతిరోజూ ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో రాహుల్ వ్యవహార శైలి ఏమాత్రం పరిణతి చెందినట్టు కనిపించదు.నిజానికి, కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్ నుంచి తానే పారిపోయింది.
వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు. సుష్మా, వసుంధరలపై నిప్పులు చెరిగారు. ఇంతకీ ఆ నోటీసులో ఏముందీ అంటే, లలిత్ మోడీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేశారట. తొలిరోజే బీజేపీ చర్చకు సౌ అనడంతో కాంగ్రెస్ షాకైంది. వెంటనే మాట మార్చింది. రాజీనామాలు చేసే వరకూ చర్చ ప్రసక్తే లేదని కొత్త పల్లవి అందుకుంది. మరి చర్చ కోసం నోటీసు ఇచ్చారు కదా అంటే జవాబు లేదు. తన మాటమీద తానే నిలబడక పోవడం పరువుతక్కువ అవుతుందనే అంచనాతో, పంతాన్ని వీడాలని రాహుల్ గాంధీ నిర్ణయించి ఉంటే కథ వేరుగా ఉండేది.
రాను రానూ కాంగ్రెస్ వ్యవహార శైలితో ఇతర విపక్షాలు విసిగిపోయాయి. బీజేపీ అంటే అంతెత్తున లేచే ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ కూడా ప్రతిరోజూ పార్లమెంటును స్తంభింప చేయడం ఏమిటని విసుక్కుంటున్నాయి. కరుడుగట్టిన బీజేపీ వ్యతిరేకిగా పేరున్న ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాడు కాంగ్రెస్ వైఖరిని బాహాటంగానే విమర్శించారు. ఇక ముందు కాంగ్రెస్ తో కలిసి సభను అడ్డుకునేది లేదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని అన్నారు. జేడీయూ వంటి పార్టీలు సైతం చర్చకు ఒప్పుకుంటేనే మంచిదని భావిస్తున్నాయి. ఒక్క ఎన్సీపీ మాత్రమే పూర్తిగా కాంగ్రెస్ వైఖరితో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తోంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సభను అడ్డుకోవడం ద్వారా జీఎస్ టి బిల్లు ఆమోదాన్ని ఆపాలని కాంగ్రెస్ ఎత్తువేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. నిజానికి, ఈ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడో ఒంటరి అయింది. తృణమూల్ కాంగ్రెస్ తో సహా ఐదారు ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆమోదించడానికి వారం క్రితమే అంగీకరించాయి. కాబట్టి, బీజేపీకి బలం లేని రాజ్యసభలోనూ ఇది సునాయాసంగా ఆమోదం పొందుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ ను దెబ్బకొట్టేలా మద్దతు సాధించడంలో బీజేపీ సఫలమైంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది. అయినా, చివరి మూడు రోజులు కూడా సభను అడ్డుకోవాలనే కాంగ్రెస్ నిర్ణయించింది. మిగతా ప్రతిపక్షాలు తమ వైఖరితో విసిగిపోయినా, సమయోచితంగా వ్యూహాన్ని మార్చాలనే పరిణతి ఇంకా రాహుల్ గాంధీకి వచ్చినట్టు లేదు. విపాసన యోగా ప్రభావాన్ని ఆయన అంతగా పొందలేదేమో.
ఆయనకు ఓ మంచి రాజకీయ గురువు దొరికితే బాగుండు అని అభిమానులు భావిస్తుంటే తప్పేముంది చెప్పండి !!