‘పుష్ప 2’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయంతే. అందులో ఒకటి ఐటెమ్ పాట. ఆ పాట అల్లు అర్జున్ – శ్రీలీలలపై తెరకెక్కిస్తారు. ఈవారంలోనే షూటింగ్ ఉండొచ్చు. దాంతో పాటు మరో పాట ఉంది. అయితే ఈ పాటని ఇప్పుడు చిత్రీకరించాలా, వద్దా? అనే సందేహంలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ఈ పాట వల్ల సినిమా లెంగ్త్ పెరుగుతోందే తప్ప, కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని టీమ్ భావిస్తోంది. పైగా.. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి పెద్దగా టైమ్ లైదు. ఇలాంటప్పుడు ఆ పాటపై ఫోకస్ చేయడం కంటే, పూర్తిగా పక్కన పెడితే టైమ్ తో పాటు, ఖర్చు కూడా కలిసొస్తుందని సుకుమార్ భావిస్తున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐటెమ్ పాట పూర్తయ్యాక… సమయాన్ని బట్టి, ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అలా జరిగితే.. ఆడియోలో ఉండే పాట, సినిమాలో కనిపించకపోవొచ్చు.
ఇటీవల దేవర సినిమా విషయంలో ఇదే జరిగింది. దావుదీ పాటని షూట్ చేశారు. కానీ.. సినిమా లెంగ్త్ లో అది సెట్ కాలేదు. దాంతో ఆ పాట లేకుండానే సినిమాని విడుదల చేశారు. ఆ తరవాత పాటని అతికించారు. అది వేరే విషయం. కథాగమనంలో ఉపయోగ పడని పాట ఎంత బాగున్నా అనవసరమే. టైమ్ తో పాటు డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఈ పాట విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఈ వారంలో ఈ పాటపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు 5న పుష్ప వస్తోంది. దానికంటే ఓ రోజు ముందే… ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.