అమ్మ, అన్నం ఎదురుగా ఉంటే విలువ తెలియదని.. దూరమైతేనే తెలుస్తుందని కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో పేర్కొన్నారు. ఆయన ఉద్దేశం బీఆర్ఎస్ లేకపోవడం వల్ల ప్రజలు ఎంతో లోటు ఫీలవుతున్నారని చెప్పడం. బీఆర్ఎస్ లేకపోవడం వల్ల ఆ విలువ తెలుస్తోందని ఆయన అనుకుంటున్నారు. మరి నిజంగా గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా అంటే.. అంతకు ముందే ఆయన వెళ్లిన ఆటోడ్రైవర్ల మీటింగే దానికి సాక్ష్యం.
కేటీఆర్ ఆటోడ్రైవర్ల సమావేశానికి వెళ్లారు. అక్కడ వారు మహాలక్ష్మి స్కీమ్స్ కారణంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. అయినా వారికి మద్దతు తెలుపుతానంటూ కేటీఆర్ ఆటోలో అక్కడకు వెళ్లారు. అక్కడ కొంత మంది ఆటోడ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో మీరేం చేశారని ప్రశ్నించారు. ఆయనపై కేటీఆర్ దురుసు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశానికి వెళ్లీ రియల్ ఎస్టేట్ పడిపోయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నట్లుగా వ్యాఖ్యానించారు.
మార్పు మార్పు అన్నారు ఇప్పుడేమయింది ? అంటూ కేటీఆర్ తనను వివిధ సమావేశాలకు ఆహ్వానించిన దగ్గర మాట్లాడుతూ ఎదుట ఉన్న వారిని కించ పరిచేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరు ఆందోళనలు చేస్తూంటే వారి దగ్గరకు వెళ్లి అవే మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని మార్పు కోరుకున్నారని ఇప్పుడేమయిందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వారు గత ప్రభుత్వంలోనూ ఆందోళనలు చేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ప్రభుత్వంలోనూ ఏవో వర్గాలు రోడ్డెక్కుతూనే ఉంటాయి. అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడం వరకూ బాగానే ఉంటుంది కానీ మార్పు కోరుకుని తన్నించుకుంటున్నారన్నట్లుగా మాట్లాడటమే వింతగా ఉంటుంది.