దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమలో స్లంప్ కనిపిస్తోంది. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని క్లియర్ చేసుకోవడానికి బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఓ కంపెనీ తమ ప్రాజెక్టులో ఇల్లు కొంటే లాంబోర్గిని కారు ఇస్తామని ఆఫర్ చేసింది. ఆ ఇంటి విలువ ఇరవై ఆరు కోట్లు. ఆ స్థాయిలో కాకపోయినా తమ ప్రాజెక్టులకు తగ్గ రేంజ్ లో చాలా కంపెనీలు ఈ బహుమతులు ప్రకటిస్తున్నాయి.
అమ్మకాలు మందగించడంతో, డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జీరో స్టాంపు డ్యూటీతోపాటు 24 నెలల వరకు నో ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నారు. కొన్ని సంస్థలు ప్లాట్ డెలివరీ చేసే వరకు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నాయి. ఐటీ రంగంలో మందగమనం కారణంగా రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న అపార్ట్ మెంట్ల అమ్మకాలపై ప్రభావం పడింది. మధ్యతరగతి ఇళ్ల నిర్మాణం డిమాండ్‌కు తగినట్లుగా ఉండటంతో వీటి అమ్మకాలపై ప్రభావం అంతగా లేదు. ముఖ్యంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే.. పుణె, బెంగళూరు, హైదరాబాద్ లలో తగ్గాయి.
అందుకే ఆఫర్లతో నగదు రొటేషన్ అయ్యేలా చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అంతర్జాతీయ పర్యటనలు, ఉచిత మాడ్యులర్ కిచెన్, మొబైల్ ఫ్లోన్ల వంటి ఆఫర్లుగా ప్రకటిస్తున్నారు. ఇవి డిమండ్ ను తగ్గించకుండా కాపాడుతున్నాయి. ఇళ్ల డిమాండ్ అనూహ్యంగా ఉన్నప్పుడు ఒక్క కంపెనీ కూడా చిన్న ఆఫర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.