చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఏమో మనస్పర్ధలు వచ్చాయనే రూమర్లను ఎప్పటికప్పుడు వండి వారుస్తుంటారు కొందరు యాంటీ ఫ్యాన్స్. ఈమధ్య ఒక వేడుకలో చిరు- అరవింద్ కనిపించిన ఓ క్లిప్ ని పట్టుకొని ”అల్లు అరవింద్ ని పట్టించుకోని చిరంజీవి’ అనే థంబ్ లైన్స్ తో స్టోరీలు రాసేశారు. ఈ యాంటీ ఫ్యాన్స్ సృష్టించిన మరో స్టోరీ… రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి పోటీగా అల్లు అరవింద్ నాగచైతన్య తండేల్ సినిమాని సంక్రాంతి బరిలోకి దించుతారని సోషల్ మీడియాలో పోస్టులు తెగ తిరిగాయి. దీని మీద ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి.
అయితే ఈ యాంటీ ఫ్యాన్స్ అందరి ఆశలపై అల్లు అరవింద్ నీళ్లు చల్లారు. సంక్రాంతికి తండేల్ సినిమా తీసుకొస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సంక్రాంతి సినిమాలకి ఒక ఈక్వేషన్ ఉంటుందని, ఆ రూల్ ని పాటించాలని చెప్పారు.
గేమ్ ఛేంజర్ సంక్రాంతి వస్తుంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా పండగ బరిలోనే దిగుతుంది. గేమ్ ఛేంజర్ కి పోటీగా అల్లు అరవింద్ సినిమాని రిలీజ్ చేసే ప్రసక్తే లేదు. ఇక వెంకటేష్ సినిమాతో పాటు తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి నాగచైతన్య ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తి చూపరు. ఇదే అల్లు మాట్లాడిన ఈక్వేషన్.
ఐతే అల్లు అరవింద్ చాలా సామరస్యంగా మాట్లాడిన ఈక్వేషన్ పై కూడా కొందరు లేనిపోని వంకలు పెడుతున్నారు. సంక్రాంతి పెద్ద సీజన్ కదా మూడు సినిమాలు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ కి కావాల్సింది రామ్ చరణ్ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ తన నిర్మాణంలో ఉన్న సినిమాని రిలీజ్ చేయడం. అది జరగలేదు. మొత్తానికి ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయాలన్న యాంటీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు అరవింద్.