అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ దొరికింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు.
ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేశారని, ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమేనని పేర్కొంటూ నంద్యాల రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.
దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ రోజు తుది తీర్పుని వెల్లడిస్తూ నంద్యాల పోలీసుల ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల పర్యటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజకీయం సంచలనంతో పాటు మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బోనస్ గా కేసు కూడా నమోదైయింది. నిజానికి ఇలాంటి కేసులు చాలా చికాకు పెడతాయి. రాజకీయాల్లో వున్న నేతలే ఏళ్ళ తరబడి కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి వుంటుంది. అలాంటి కేసుని ఎట్టకేలకు కోర్టు కొట్టేయడం బన్నీకి ఓ పెద్ద ఊరటే.