టియాంజిన్, జూన్ 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటన ఆరంభమైంది. ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) వేదికగా ఆయన దేశాధినేతలతో, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4 గంటల 10 నిమిషాలకు సీఎం చంద్రబాబు హాంగ్‌కాంగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి 6 గంటల 40 నిమిషాలకు బయల్దేరి టియాంజిన్ చేరిన సీఎం బృందానికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కమ్యూనికేషన్ విభాగం ఈ వివరాలను అందజేసింది. ఆదివారం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాంగ్జు డింగ్షెన్ (HANGZHOU DINGSHEN) ఇండస్ట్రీ గ్రూపు చైర్మన్ జోగ్జిన్హాయ్ (ZHOUXIANHAI) తో సమావేశమయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో అపార ఖనిజసంపద, విస్తార అవకాశాలపై ముఖ్యమంత్రి జోగ్జిన్హాయ్కు వివరించారు.
వ్యాపార సరళీకరణ అంశంలో భారత్‌లో ఏపీ రెండో స్థానంలో, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మూడోస్థానంలో వున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్తులో లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని, తూర్పుతీర ముఖద్వారంగా నౌకా రవాణాలో కీలకపాత్ర పోషించనుందని తెలియజేశారు.
విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగళూరు కారిడార్ల ద్వారా పారిశ్రామికాభివృద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
విద్యుత్‌ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మిగులును సాధించిందని, తమ రాష్ట్రానికి పుష్కల జలవనరులున్నాయని, నూతన సాంకేతికతను అందిపుచ్చుకోగల యువశక్తి తమ బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ విధానాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు.
శ్రీలంక మంత్రితో సమావేశం
తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీలంక మంత్రి సమరవిక్రమతో భేటీ అయ్యారు. శ్రీలంక ప్రధాని పంపించిన శుభాకాంక్షల సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ తో కలసి పనిచేయాలని తమ ప్రధాని ఆకాంక్షను వ్యక్తం చేశారని సమర విక్రమ తెలిపారు.
శ్రీలంకకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుబంధం ఎంతో ప్రాచీనమైనదని, శ్రీలంక చరిత్రలో బుద్ధిజానికి సంబంధించి అమరావతి ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. పర్యాటకరంగంలో ఆంధ్రప్రదేశ్‌తో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపార వాణిజ్యాల్లో తూర్పు ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారంగా తీర్చిదిద్దుతున్నట్లు శ్రీలంక మంత్రి సమరవిక్రమకు వివరించారు. పోర్టు ఆధారిత అభివృద్ధిపై తాము దృష్టిని కేంద్రీకరించామని తెలిపారు. ఇదిలా ఉంటే తమ దేశంలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీలంక మంత్రి సమర విక్రమ ఆహ్వానించారు.
కువైట్ డానిష్ డెయిరీ కంపెనీ చైర్మన్‌తో సమావేశం
తర్వాత కువైట్ డెయిరీ కంపెనీ సీఈఓ మహ్మద్ జాఫర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కువైట్ డానిష్ డెయిరీ ఆసక్తి కనపరిచింది. వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడిపరిశ్రమ, ఉద్యాన పంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రబల శక్తిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తాము జలవనరుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. సూక్ష్మ, బిందునీటి సేద్యం ద్వారా 75 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని వివరించారు. సంప్రదాయ, నవీన పద్ధతుల్ని మేళవించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తునట్లు చెబుతూ, ఇందులో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కువైట్ డానిష్ డెయిరీ సీఈఓను కోరారు.
ఈ సమావేశల్లో మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా.పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.