సాహిత్యం నుంచి సినిమా రంగంలోకి వచ్చారు కరణ కుమార్. ఆయనది ఉత్తరాంధ్ర. ఆ ప్రాంతం మూలాల్లోకి వెళ్లి చెప్పిన ‘పలాస’ కథ దర్శకుడిగా ఆయనకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అందులో పాటల్లో కూడా సొగసైన ఉత్తరాంధ్ర మాండలికం వినిపిస్తుంది. సాహిత్యంలో ఆయన అభిరుచి కనిపిస్తుంది.
ఇపుడు ఆయన నుంచి ‘మట్కా’ సినిమా వస్తోంది. ఇది కూడా ఉత్తరాంధ్ర నేపధ్యం వున్న కథే. ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర జానపదం టచ్ వుండే ఓ సాంగ్ ని డిజైన్ చేశారు. అదే.. రామ టాకీస్ ర్యాంప్ సాంగ్. నిజానికి ఈ సినిమాకి మ్యూజిక్ జివి ప్రకాష్. అయితే ఈ స్పెషల్ సాంగ్ ని మాత్రం తన టేస్ట్ కి తగ్గట్టు.. అక్కడ కల్చర్ ని ధ్వనించేలా భవానీ రాకేష్ తో కంపోజ్ చేయించుకున్నారు. ఈ పాటని కరణ కుమారే స్వయంగా రాశారు.
రామా టాకీస్ రోడ్డు మీద రంగు రాళ్లు అమ్మేవాడా
రాతిలో ఏమున్నది నీ సేతిలో ఉన్నది పనితనం
అల్లీపురం మేడ.. ఆకాశం రంగు చీర
ఆ చీరే నేను కట్టి నీకోసం సూస్తా ఉంటే
నన్ను సూడాలని లేదా.. రాళ్లు అమ్మాలని లేదా
దొండాపర్తి సిలక అద్దాల రైక గిలక
నీ సూపులో ఉన్నదే సురుకైనా సూది మందు
నిన్ను సూడాలని లేదే.. రాళ్లు అమ్మాలని లేదే” ఇలా గమ్మత్తయిన జానపదం శైలిలో సాగింది కరణ కుమార్ సాహిత్యం. మాట్కా పాటల్లో విలక్షణంగా నిలిచే పాటే ఇది. జానపద పాటలకు మన్నిక ఎక్కువ. ఈ పాట కూడా చాలా కాలంలో జనాల్లో నానే అవకాశం వుంది. ఈ నెల 14న ఈ సినిమా వస్తోంది.