ఉమ్మడి కుటుంబం నిలబడాలంటే అందరూ బాధ్యతగా ఉండాలి. ఒక్కరు ఇతరుల్ని గౌరవించకపోయినా…. మరో విధంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించినా కుటుంబం అంతా డిస్ట్రబ్ అవుతుంది. అలాంటి ఉమ్మడి కుటుంబం లాంటిదే రాజకీయ పార్టీ కూటమి కూడా. ఏపీలో కూటమిలో ఇప్పటి వరకూ అంతా సాఫీగా సాగిపోయింది. కానీ పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా అంతా మారిపోయింది.
పవన్ మాటలు టీ కప్పులో తుఫానే కానీ – శాశ్వతం !
పవన్ కల్యాణ్ కూటమి పార్టీల్లో ఓ పార్టీ కి చెందిన హోంమంత్రి విఫలమయ్యారన్నట్లుగా మాట్లాడటం ఖచ్చితంగా కూటమి ఐక్యతపై ప్రభావం చూపేదే. ఆ మంత్రితో పాటు టీడీపీ నేతలెవరూ ఆవేశపడటం లేదు. అందరూ సంయమనంతో వ్యవహరించారు. కుటుంబ వ్యవహారమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తప్పేమీ మాట్లాడలేదని వారంతా చెప్పుకొచ్చారు. ఆ విషయంలో వారు కూటమిలో ఏర్పడిన గ్యాప్‌ను మరింత పెంచకుండా చేశారని అనుకోవచ్చు. కానీ అంతర్గతంగా మాత్రం అది ప్రభావం చూపిస్తూనే ఉంటుంది.
గ్యాప్ పెంచేందుకు వాడుకోనున్న వైసీపీ
రాజకీయపార్టీల స్నేహం మధ్య చిన్న గ్యాప్ వస్తే చాలు… ఇతర అంశాల్లో వాటి మధ్య అభిప్రాయబేధాలు పెరిగిపోవడానికి ఎన్నో కారణాలు వెదుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి రాజకీయ పార్టీలపై పడింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ మాటల ఆధారంగా కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇప్పటికే తాను చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తర్వాత జనసైనికులు, నేతలు కూడా హుందా స్పందించారు. అవి జనరల్‌గా చేసిన వ్యాఖ్యలేనని ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదన్నారు.
ఐక్యత కాపాడుకోవడానికి ప్రత్యేకమైన వ్యూహం అవసరం
ఏదేమైనా సాఫీగా సాగిపోతున్న కూటమి పయనంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఓ కుదుపు ఇచ్చాయని అనుకోవచ్చు. ఇప్పటికి బయటకు ఎలాంటి ప్రభావం కనిపించదు కానీ.. అది భవిష్యత్‌లో వచ్చే పలు సమస్యలకు మూలం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇక ముందు ఇప్పుడు పడిన గ్యాప్ ను పెరగకుండా… వీలైతే.. ఆ గ్యాప్ తగ్గేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది.