ఒకప్పుడు టాలీవుడ్ ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన కథానాయిక.. అనుష్క. అగ్ర హీరోలందరితోనూ నటించింది. హిట్లు, సూపర్ హిట్లు అందుకొంది. అరుంధతితో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కొత్త ఊపు ఇచ్చింది. అత్యధిక పారితోషికం అందుకొన్న కథానాయికల జాబితాలో చేరింది. ఆమె ఖాతాలో బాహుబలి లాంటి మేటి చిత్రం కూడా చేరింది. అయితే ఆ తరవాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. సినిమాలు తగ్గాయి. తాను కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. స్వీటీ సినిమాలకు దూరం అవుతుందని, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని భావించారంతా. కానీ.. కొంత విరామం తరవాత మళ్లీ సినిమాలు మొదలెట్టింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో రీ ఎంట్రీలో ఓ డీసెంట్ హిట్ సాధించింది. ఆ తరవాత అనుష్క నుంచి మళ్లీ సినిమా రాలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది. కన్నడలో ‘కథనార్’ అనే వంద కోట్ల భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇవి రెండూ స్వీటీకి చాలా కీలకమైన సినిమాలు. క్రిష్ సినిమాలో తనే హీరో… హీరోయిన్. ఈ సినిమాపై అయితే చాలా ఆశలు పెట్టుకొంది. నటనా పరంగా కూడా తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనుష్క భావిస్తోంది.
దాంతో పాటు ‘భాగమతి 2’ కథ రెడీ అవుతోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇవన్నీ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కావు. హీరోలు, వాళ్లతో డాన్సులు చేయడం ఇలాంటి సెటప్ ఏమీ లేదు. అనుష్క ఆ తరహా కథలకు ఎప్పుడో దూరం అయిపోయింది. ఇప్పుడు కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలకు పరిమితం అయిపోయింది. అయితే అందులోనూ.. కొత్త తరహా ప్రయాణం చేయాల్సిన బాధ్యత అనుష్కపై ఉంది. ఈ విషయంలో అలియాభట్, విద్యాబాలన్, నయనతార లను అనుష్క ఆదర్శంగా తీసుకోవాలి. కొత్త జోనర్లను టచ్ చేయాలి. లేదంటే.. రొటీన్ దారిలో పడిపోయే ప్రమాదం ఉంది. అనుష్క లాంటి కథానాయికలు క్రౌడ్ పుల్లర్స్. సరైన కథ దొరకాలే కానీ, అద్భుతాలు సృష్టించగల సత్తా వాళ్లకు ఉంది. అలాంటప్పుడు కథల ఎంపికలో తప్పు చేయకూడదు. వాళ్ల కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోకూడదు. ఒక హిట్ పడితే అంతా సర్దుకొంటుంది. మరి అనుష్క ప్రయాణం ఎటు వైపు వెళ్తుందో చూడాలి. అన్నట్టు ఈ రోజు స్వీటీ పుట్టిన రోజు. తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది.