మేఘా కంపెనీకి కాంట్రాక్టులు ఇస్తే .. ఆ పత్రాలపై సంతకం పెట్టిన అధికారుల్ని తాము వచ్చాక జైలుకు పంపుతామని కేటీఆర్ బహిరంగంగా బెదిరించారు. ఆయన కాంట్రాక్టర్ పేరు పెట్టి మరీ చెప్పారు. మేఘా తప్ప ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చినా ఓకే అని ఆన్నట్లుగా ఆయన భావన ఉంది. మేఘాపై ఇంత కోపం కేటీఆర్కు ఎందుకు వస్తోంది?. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లలో అత్యధిక మొత్తం మేఘాతో పాటు అనుబంధ కంపెనీల విరాళేలే సింహభాగం. ప్రత్యేక విమానం కూడా మేఘా ఇచ్చిన విరాళమేనన్న అనుమానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఆ సంస్థపై కోపం.? కాంట్రాక్టులు చేయకూడదా ? చేసినా తమకే రిపోర్టు చేయాలనుకుంటున్నారా ?
ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రెండు వందల కోట్ల విరాళం
మేఘా సంస్థ, తన అనుబంధ సంస్థలతో కలిపి బీఆర్ఎస్కు రూ. రెండు వందలకు పైగా కోట్ల విరాళం ఇచ్చింది. ఇదందా పూర్తిగా వైట్ మనీ. లెక్కల్లో చూపించింది. దేశంలో బీజేపీ తర్వాత బీఆర్ఎస్కే మేఘా కంపెనీ ఎక్కువగా ఇచ్చింది. బీఆర్ఎస్, మేఘా కంపెనీ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వయంగా కేసీఆర్ మేఘా కృష్ణారెడ్డికి సన్మానం కూడా చేశారు. కాంట్రాక్టుల్లో సింహభాగం మేఘాకే దక్కుతాయి. బీఆర్ఎస్కు కావాల్సిన వారికి మేఘా సబ్ కాంట్రాక్టులు ఇస్తారు.
ఇప్పుడు టెండర్లు వేయక ముందే ఆరోపణలు
మూసి ప్రాజెక్టు కూడా మేఘాకే ఇచ్చేస్తారు… హైదరాబాద్కు నీళ్లిచ్చే గోదావరి ఫేజ్ టు ప్రాజెక్టును కూడా అంచనాలు పెంచి మేఘాకే ఇచ్చేస్తారు అని కేటీఆర్ భవిష్యత్ ను ఊహించి మరీ ఆరోపణలు చేస్తున్నారు. అసలు మూసి టెండర్లే పిలవలేదు. అప్పుడే ఇచ్చేస్తారని ఎలా ఊహించారు ?. నిజానికి అలా ఇచ్చేస్తారని కంగారు పడి కేటీఆర్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఇవ్వకూడదని అనుకుంటున్నారు. తమకు అత్యంత ఆత్మీయమైన ఎన్నో వందల కోట్లు విరాళాలిచ్చిన మేఘాకు కాంట్రాక్టులు రాకూడదని.. చేయకూడదని బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటోంది ?
పాత కమిషన్లు క్లియర్ చేయలేదా ?
మేఘా నుంచి బీఆర్ఎస్ లబ్ది పొందిందనేది బహిరంగ రహస్యం. అదే సమయంలో బీఆర్ఎస్ పెద్దలు మేఘాకు లబ్ది చేకూర్చారనేది కూడా అందరూ నమ్మిన విషయం. పరస్పర ప్రయోజనాలు పొందారు. మరి ఇప్పుడు ఇంకా కాంట్రాక్టులు దక్కక ముందే ఎందుకు మేఘాపై కేటీఆర్ బురద చల్లేస్తున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఏం పనులు చేసినా గతంలోలా “ప్రోటోకాల్” పాటించాలని అనుకుంటున్నారా ? లేకపోతే పాత బాకీలను క్లియర్ చేయడానికి మేఘా వాళ్లు వెనుకడుగు వేస్తున్నారా ?. ఏదైనా లోగుట్టు బీఆర్ఎస్ పెద్దలకు.. మేఘా పెద్దలకే తెలియాలి ?