విజయవాడ, విశాఖల్లో మెట్రో తీసుకు రావాలని ఏపీ ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. డీపీఆర్ రెడీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఐదేళ్లలో కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి. అనేక సవాళ్ల మధ్య చాలా వరకూ పేపర్ వర్క్ పూర్తి చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ పాతి పెట్టినట్లే మెట్రోనూ చేశారు. ఐదేళ్లలో రివర్స్ చేశారు. ఫలితంగా అంతకు ముందు ఐదేళ్లలో చేసిన కృషి కూడా వృధా అయింది.
రెండు సిటీలకు కలిపి దాదాపుగా రూ. 42 వేల కోట్ల వరకూ ఖర్చు అయ్యేలా డీపీఆర్ రెడీ అయింది. భూసేకరణ ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతీ రాష్ట్రంలో ఓ మేజర్ సిటీకి మెట్రో ఇవ్వడం కేంద్రం ఆనవాయితీగా పెట్టుకుంది. అందుకే అనేక రాష్ట్రాల్లో మెట్రోలు వస్తున్నాయి. ఏపీకి విశాఖ, విజయవాడలకు అర్హత ఉంది. పైగా ఇప్పుడు కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది.
కేంద్రం మొత్తం పెట్టుకోకపోయినా ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్లో అంగీకారం తెలిపినా పట్టాలెక్కుతుంది. వయబులిటి ఉంటుందని ఇప్పటికే నివేదికలు వచ్చాయి. ప్రభుత్వం సహకరిస్తే.. ఎల అండ్ టీ లాంటి సంస్థలు ముందుకు వస్తాయి. మొత్తం ఒకే సారి విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఐదారేళ్లు పట్టే అవకాశం ఉంది. అంటే.. ఏటాది నాలుగైదుల వేల కోట్లు కేటాయించినా పనులు జోరుగా సాగుతాయి. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు సక్సెస్ అయితే… వచ్చే ఐదేళ్లలో విజయవాడ, విశాఖల్లో మెట్రో కదలికలు చూడవచ్చు.
అత్యాధునిక ప్రజా రవాణా సౌకర్యాల్లో మెట్రో ఒకటి. ఇది నగరాలకు మణిహారంగా ఉంటుంది. విశాఖ, విజయవాడల్లో మెట్రోలు తిరుగుతూ ఉంటే.. ఖచ్చితంగా మెట్రో నగరాలకు మారేందుకు అర్హత సాధించినట్లే అవుతాయి.