‘పుష్ప 2’కి సంబంధించిన కీలకమైన వార్త ఒకటి బయట షికారు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్, అజనీష్ లోక్‌నాథ్ పంచుకొన్నారన్నది ఆ వార్త సారాంశం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్‌లది తిరుగులేని కాంబినేషన్. ‘నా ఆత్మ.. దేవి’ అని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాంటిది.. దేవిశ్రీతో కాకుండా మరో సంగీత దర్శకుడితో సుక్కు ఎందుకు పని చేస్తాడు? అనేదే ప్రశ్న.
అయితే దానికీ ఓ కారణం ఉంది. `పుష్ప 2`కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావుడిగా సాగుతున్నాయి. ఈనెల 20 నాటికి.. ఫస్ట్ కాపీ రెడీ అయిపోవాలి. సినిమా మొత్తం ఆర్.ఆర్ చేయాల్సివుంది. మరోవైపు ఓ ఐటెమ్ పాట పూర్తి చేయాలి. ఆ ఐటెమ్ పాటకు సంబంధించిన చిన్న చిన్న కరెక్షన్స్ పూర్తవ్వాల్సివుంది. ఓ వైపు పాట, మరోవైపు ఆర్.ఆర్. ఇదంతా దేవిశ్రీ ప్రసాద్ పై ఒత్తిడి పెంచుతోంది. పైగా రాత్రింబవళ్లూ కష్టపడినా నవంబరు 20 నాటికి ఆర్.ఆర్ పూర్తవ్వదు కాబట్టి, తమన్. అజనీష్ ల సాయం తీసుకోవాల్సివచ్చిందని సమాచారం. ఫస్టాఫ్ లో కొంత మేర.. దేవిశ్రీ ప్రసాద్ ఆర్.ఆర్ చేసేశాడు. ఫస్టాఫ్‌లో కొంత భాగం, సెకండాఫ్ పూర్తిగా ఆర్.ఆర్ చేయాల్సివుంది. ఈ బాధ్యతలు తమన్, అజనీష్లు పంచుకొంటారు.
నిజానికి దేవిశ్రీ కాకుండా మరో సంగీత దర్శకుడితో పని చేయడం సుకుమార్‌కు కూడా ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆర్.ఆర్ ఇవ్వడంలో తమన్ చాలా స్పీడు. కాకపోతే.. సుకుమార్ స్టైల్ కి ఎంత త్వరగా మ్యాచ్ అవుతాడన్నది చూడాలి.