రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయిచింది. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్న వీరు.. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న వైసీపీ.. ఎన్నికల్లో పోటీ చేసి దాన్ని నిరూపించాల్సింది పోయి పోటీ చేయలేమని పారిపోయింది.
అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలనూ వదిలి పెట్టకుండా పోటీ చేసి దొంగ ఓట్లతో అయినా మ్యాజిక్ చేసి గెలవడం నేర్చుకున్నారు. కానీ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసినా భారీ తేడాతో ఓడిపోవడంతో.. చదువుకున్న వారు ఎవరూ వైసీపీకి ఓటేయరని గతంలోనే డిసైడ్ అయ్యారు. అందుకే మా ఓటర్లు వేరు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కవర్ చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడం.. పోటీ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో అసలు పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని పేర్ని నానితో ప్రకటింప చేశారు.
వైసీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి కనీస ఓట్లు తెచ్చుకోకపోతే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న భయంతో పోటీకి దూరంగా ఉండటం నిర్ణయించుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. పార్టీ నేతలను గ్రాడ్యూయేట్ ఓటర్లుగా నమోదు చేయించారు. వైసీపీ నేతలు పట్టించుకోలేదు.