రేవంత్ రెడ్డి యాభై ఏళ్లు దాటిన కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎవరు ?. ఓ బలమైన రాజకీయం కుటుంబం నుంచి రాలేదు. వేలకోట్ల ఆస్తిపరుడైన కుటుంబం రాలేదు. ఆయన అత్యంత సామాన్య కుటుంబం నుంచి ఓ సామాన్యుడు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన రెండు దశాబ్దాల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. అందు కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టలేదు. మత ఉన్మాదంతో ఆగిపోలేదు. ప్రజల్ని,యువతను ఆత్మహత్యలకు పురికొల్పలేదు. తన రాజకీయాన్ని తాను చేశారు. రాజకీయాన్ని రాజకీయంలాగే చేశారు. అందులో ఎదురైన కష్టనష్టాలు అన్నీ తానే అనుభవించారు. కానీ ఏ దశలోనూ నమ్మకం కోల్పోలేదు. అదే ఆయన విజయ రహస్యం.
నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు డాన్స్ చేశాడు అని రేవంత్‌ను హరీష్ రావు ఎగతాళి చేశారు. అది ఆయనకు ఎగతాళిగా ఉండవచ్చు కానీ.. రేవంత్ ఎక్కడి నుంచి ప్రారంభించి ఎలా ఎదిగాడో.. చూస్తే ఎవరికైనా అది ఎలివేషన్లాగే అనిపిస్తుంది. రేవంత్ జడ్పీటీసీగా మొదట ఇండిపెండెంట్‌గా గెలిచాడు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గానే గెలిచారు. తర్వాత టీడీపీలో చేరారు. తన నీడలోకి రావాలని అప్పటి సీఎం వైఎస్ ఒత్తిడి చేసినా వెళ్లలేదు. ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలో రేవంత్‌కు తెలుసు. ఆయనను కేసీఆర్ మొదటి శత్రువుగా చేసుకోవడంతో రేవంత్‌కు తిరుగులేకుండా పోయింది. దేనికైనా తెగించే గుణం ఉన్న ఆయన ఇక తగ్గలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. రేపు ఏ స్థాయికి వెళ్తారో ఊహించడం కష్టం. ఎందుకంటే రేవంత్ వంటి నేతలకు ఆకాశమే హద్దు.
పాలనలోనూ ఆయన ఇదే మార్క్ చూపిస్తున్నారు. మూసి ప్రక్షాళన విషయంలో విపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తున్నా ఆ ప్రాజెక్టు వల్ల జరిగే కష్టనష్టాలేంటో తెలుసు కాబట్టి పట్టుదలగా.ముందుకెళ్తున్నారు. రేవంత్ పాలనలో చేపట్టిన నిర్ణయాలన్నీ అలాంటివే. ఎక్కడా తగ్గడం లేదు. హైడ్రా కానీ మరొకటి కానీ చేయాలనుకున్నది చేసి తీరుతున్నారు. అదే ఆయన పట్టుదల.. అదే ఆయన బలం.
తమ అధికారం లాక్కున్నారని కొంత మందికి.. తమకు అధికారం రాకుండా చేశారని మరికొంతమందికి రేవంత్ రెడ్డిపై కోపం ఉండవచ్చు. కానీ ఆయనలా మాత్రం వారెవరూ ఎదురీదలేదు. అందుకే ఆయనకు ఎదురునిలబడలేరు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ధృవతార. దీన్ని ఎవరూ కాదనలేరు.
హ్యాపీ బర్త్‌డే సీఎం రేవంత్ రెడ్డి !