‘మా సినిమాకి ఎవరి సపోర్ట్ లేదు. చాలా మంది సెలబ్రిటీలని సంప్రదించాం. ఎవరూ మాట సాయం చేయలేదు. కనీసం ఫోన్ లు ఎత్తలేదు’ ఇలాంటి స్టేట్మెంట్లు పరిశ్రమలో సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. తాజాగా కిరణ్ అబ్బవరం, రాకేశ్ లాంటి నటులు ఈ విషయంలో బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక సినిమా ఈవెంట్ కి సెలబ్రిటీ తీసుకురావడం కంటే ఒక సినిమా తీయడం ఈజీ’అని నిట్టూర్చాడు.
ఈ మొత్తం ఎపిసోడ్ పై అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తన వెర్షన్ ని వినిపించారు. తాజాగా ‘క’ సినిమా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘కిరణ్ అబ్బవరం మాటలు విన్నా. అదే విధంగా నిన్న ఒక నటుడు కూడా సెలబ్రిటీలు ఎవరూ తమ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి రావడం లేదన్నాడు. ఇక్కడ ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే నిరూపించుకోవాలి. టాలెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఓన్లీ ట్యాలెంట్. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్ళం వచ్చి అభినందిస్తాం కానీ ఇక్కడ ఎవ్వడూ ఎవరికీ సపోర్ట్ చేయరు’ అని నిర్మోహమాటంగా చెప్పారు దిల్ రాజు.
వినడానికి కాస్త కటువుగా వున్నా దిల్ రాజు మాటల్లో వాస్తవం వుంది. ఇక్కడ సక్సెస్ కి అభినందలు తప్పితే ప్రయత్నం చేసేటప్పుడు ఎవరి సహకారం, సపోర్ట్ వుండదు. ఇది రియలైజ్ అయితే డిస్సాపాయింట్మెంట్ వుండదు.