ఒక ఎస్పీ బదిలీ, మరో సీఐని సస్పెండ్ చేయించి మరీ పారిపోయిన సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేపోయారు. ఆయనను మహబూబ్ నగర్ జిల్లాలో కడప పోలీసులు పట్టుకున్నారు. మూడు రోజుల కిందట ఆయనను అరెస్ట్ చేశారు. కానీ కొంత మంది పోలీసులు కుట్ర పూరితంగా 41ఏ నోటీసులు ఇచ్చి పంపేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. వెంటనే ఎస్పీని బదిలీ చేశారు. చిన్న చౌక్ సీఐని సస్పెండ్ చేశారు. అప్పటికీ పోలీసులకు విషయం అర్థం కావడంతో వర్రాను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
తాను ఉపయోగించే కారును జమ్మలమడుగులో వదిలి పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి తన రెండు ఫోన్లను ధ్వంసం చేసి పరారయ్యారు. అయితే ఆయన సన్నిహితులపై నిఘా పెట్టిన పోలీసులు కదలికలను గుర్తించారు. మొదట బెంగళూరు వెళ్లి అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నిస్తూ మహబూబ్ నగర్లో దొరికిపోయారు. ఆయనను పట్టుకుని కడపకు తరలించారు.
సోషల్ మీడియా సైకోల్లో నెంబర్ వన్ గా వర్రా రవీంద్రారెడ్డి ఉన్నారు. ఆడవాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసేవారు. చివరికి షర్మిల,సునీతపై కూడా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై వారు కూడా గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు వర్రా పాపం పండింది. ఆయన అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనను పోలీసు స్టేషన్ నుంచి తప్పించడం వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.