Dhoom Dhaam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కొత్త హీరోలు చాలా ఉధృతంగా వస్తున్న రోజులు ఇవి. ప్రేక్షకులు కూడా కొత్తా, పాత అని బేరీజు వేసుకోవడం లేదు. వాళ్లకు కంటెంట్ కొత్తగా ఉంటే చాలు. అదే లేకపోతే స్టార్ల సినిమాలు కూడా చూడడం లేదు. చేతన్ మద్దినేని ఇది వరకు కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం కనిపించలేదు. ఈసారి తన నుంచి ‘ధూమ్ ధామ్’ అనే సినిమా వచ్చింది. ఈసారి తనకు టెక్నికల్ సపోర్ట్ దొరికింది. స్టార్ కాస్టింగ్ కూడా బాగానే కుదిరింది. వీళ్లంతా కలిసి చేతన్ కోసం చేతనైనంత సాయం చేశారు. మరి ఈ ప్రయత్నం సఫలీకృతం అయ్యిందా? చేతన్‌కు హిట్ దొరికిందా?
రామరాజు (సాయికుమార్), కార్తీక్ (చేతన్ మద్దినేని) తండ్రీ కొడుకులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రతీ విషయంలోనూ తన కొడుకే నెంబర్ వన్ అవ్వాలన్నది రామరాజు ఆశ. కార్తీక్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుచుకొనే కొడుకు. రామరాజు బెస్ట్ ఫాదర్ అయితే.. కార్తీక్ బెస్ట్ సన్ అన్నమాట. అయితే.. వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ప్రవేశిస్తుందని, వాళ్ల వల్ల ఒకరికి ఒకరు దూరం అవుతారని ఓ జ్యోతిష్యుడు (ఫృథ్వీ) జోస్యం చెబుతాడు. అనుకొన్నట్టుగానే సుహానా (హెబ్బా పటేల్) కార్తీక్‌కు పరిచయం అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు. మరి.. సుహానా వల్ల ఈ తండ్రీ కొడుకులు విడిపోయారా? జోస్యం సంగతి ఏమైంది? అనేది మిగిలిన కథ
ఈ కథ ఇంత సింపుల్ గా తేల్చేసినా ఇందులో చాలా రకాల కథలు మిళితమై ఉన్నాయి. మొదట తండ్రీ కొడుకుల కథగా మొదలైన ఈ సినిమా ఆ తరవాత టిపికల్ లవ్ స్టోరీ టర్న్ తీసుకొంటుంది. కథానాయిక పాత్రని పరిచయం చేయడం, ఆమె ఆడే దాగుడు మూతల ఆట చూస్తే.. ఇదేదో హీరోయిన్ సెంట్రిక్ సినిమా అనిపిస్తుంది. ఆ తరవాత వీరిద్దరి కథలో మరో అమ్మాయి ప్రవేశిస్తుంది. దాంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూడ్ వస్తుంది. ఆ తరవాత.. ఊరు, అక్కడ రథం లాగడం, ఓ విగ్రహం ఎత్తుకుపోవడం.. ఈ ఎపిసోడ్లతో కొత్త రంగు పులుముకుంటుంది. ఏదో ఓ జోనర్‌కి స్ట్రిక్ అవ్వకపోవడం, వెంటవెంటనే లేయర్లు మార్చుకొంటూ వెళ్లడం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నిజానికి ఊరి కథ, అక్కడ విగ్రహం ఎపిసోడ్ ఈ కథకు మూలం. దాన్ని బాగా ఎలివేట్ చేయాల్సింది. ఆ సీన్‌ని చాలా సాదా సీదాగా తీసేశారు. సెకండాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్‌తో కాస్త జోష్ వస్తుంది. ‘ఎక్స్ప్రెషన్ ముఖ్యం’ అంటూ సందడి చేసే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంటుంది. పెళ్లిలో చూపించిన మిగిలిన క్యారెక్టర్లు కూడా ఫన్ క్రియేట్ చేస్తుంటాయి. దాంతో సెకండాఫ్ కాలక్షేపం అయిపోతుంది. పెద్దగా టర్నింగులూ, ట్విస్టులూ లేకుండానే సినిమా ప్రేక్షకుడి అంచనాలకు అనుగుణంగానే ముగుస్తుంది.
ఈ చిత్రానికి గోపీమోహన్ రచయితగా పని చేశారు. ఆయన టింజ్ బాగానే కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో. శ్రీనువైట్ల గత సినిమాల సరళిలో ఆ సన్నివేశాలు సాగాయి. ముఖ్యంగా తాగుడు సీన్. ఇది అచ్చంగా శ్రీనువైట్ల ఎఫెక్ట్ లానే కనిపించింది. అక్కడ వెన్నెల కిషోర్ ఉండడం వల్ల, కొంత ఉపశమనం దక్కింది. విలన్ గ్యాంగ్ మధ్యన హీరో ఉంటూ, వాళ్లతో ఆడుకోవడం, వాళ్లని బకరాల్ని చేయడం గోపీమోహన్ లాంటి రచయితలే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫార్ములాని అందరూ వాడుకొని పిప్పి పిప్పి చేశారు. అయినా గోపీమోహన్ కి దానిపై మమకారం తగ్గలేదనిపించింది. యూరప్ ఎపిసోడ్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది.అప్పుడు ఫస్టాఫ్ కూడా పాస్ అయిపోయేది. అక్కడ రొటీన్ సీన్లు ప్రేక్షకుల్ని బాగా విసిగిస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఓ ఛేజ్ ఉంటుంది. హీరో అండ్ గ్యాంగ్ ని వెనుక రౌడీ మూక పరిగెట్టేస్తుంటుంది. దొరికేస్తారేమో అనుకొనే సందర్భంలో.. ‘మనం ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా ఆలోచించరా’ అంటూ హీరో ఫ్రెండ్ వేడుకొంటాడు. అప్పుడు హీరో ఓ విజిల్ వేస్తాడు. అక్కడ దర్శకుడు ఏదైనా గమ్మత్తుగా ఆలోచించాడేమో అనే భ్రమ కాసేపు కలుగుతుంది. కట్ చేస్తే.. ఓ కారొస్తుంది. అందరూ హాయిగా ఆ కార్లో కూర్చుని జంప్ అయిపోతారు. దాన్నే ఎస్కేప్ ప్లాన్ అంటారా..? ఏమో.. ఈ సంగతి గోపీమోహనే చెప్పాలి.
చేతన్ ఇది వరకు కొన్ని సినిమాలు చేశాడు. చూడ్డానికి బాగున్నాడు. కానీ ఎక్స్ప్రెషన్స్ విషయంలో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చుట్టూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్బా మిస్ మ్యాచింగ్. హీరోకి అక్కలా అనిపించింది. హెబ్బా కనిపించినప్పుడు ఇది హీరోయిన్ సెంట్రిక్ సినిమా ఏమో అనిపించింది. కాదని తెలిశాక, ఈ పాత్రకు ఆమెను ఎందుకు తీసుకొన్నారో అనే అనుమానం వస్తుంది. ఓ మంచి తండ్రిలా సాయి కుమార్ అలవాటైన నటనే ప్రదర్శించారు. భూపతి బ్రదర్స్ లో గోపరాజు రమణకే ఎక్కువ మార్కులు పడతాయి. బెనర్జీ లాంటి సీరియర్ నటుడ్ని పట్టుకొని `నీ ఫేస్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా పలికి చావదు` అని మాటి మాటికీ వెన్నెల కిషోర్‌తో అనిపించడం టూమచ్! ఇక వెన్నెల కిషోర్ సెకండాఫ్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. తను కనిపించినప్పుడల్లా రిలీఫ్‌గా అనిపించింది. తన టైమింగ్ ఈ సినిమాకు ప్లస్.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. సాహిత్యం కూడా చెవులకు ఇంపుగా వినిపించింది. సంగీత్ పాట మాస్‌కి నచ్చుతుంది. కెమెరా వర్క్ తో ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ పోతుంది. నిర్మాతలు అవసరానికి మించి ఎక్కువగానే ఖర్చు పెట్టారు. యూరప్ లో కొన్ని సీన్లు తీశారు. దాంతో రిచ్ లుక్ వచ్చింది. ఎలాంటి అంచనాలూ లేకుండా థియేటర్లకు వెళ్తే కాస్త కాలక్షేపం ఇచ్చే సినిమా ఇది.
తెలుగు360 రేటింగ్: 2.5/5