నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చాటుకొన్నాడు వేణు ఉడుగుల. ఆ తరవాత ఆయన్నుంచి విరాట పర్వం అనే సినిమా వచ్చింది. అది కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొంది. విరాటపర్వం తరవాత వేణు మరో సినిమా చేయలేదు. కథలు రాసుకొని, హీరోల్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈలోగా ఆయన నిర్మాణంలో ఓ చిత్రం మొదలైంది. అదే ‘రాజు వెడ్స్ రాంబాయ్’. శైలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ సౌజన్యంతో తెరకెక్కిన సినిమా ఇది. సాధారణంగా ఈటీవీ విన్ సంస్థ సినిమాలు తీస్తే – అది కేవలం ఓటీటీకి పరిమితం అవుతుంది. అయితే ఈసారి మాత్రం థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ రేపు బయటకు రావొచ్చు. ఇదో లవ్ స్టోరీ అయినా, సెన్సిటీవ్ విషయాలు డీల్ చేశారని, కమర్షియల్ కోణంలో ఈ కథని తీర్చిదిద్దారని తెలుస్తోంది.
మరోవైపు వేణు ఉడుగుల దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ‘విరాటపర్వం’ తరవాత రెండు పెద్ద సంస్థల నుంచి ఆయన అడ్వాన్స్ తీసుకొన్నారు. కథ రెడీ అయ్యింది కానీ, హీరో సెట్ అవ్వడం లేదు. అంతా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. తొలి రెండు సినిమాల్లోనూ బలమైన సామాజిక అంశాన్ని తెరపై చూపించిన వేణు ఈసారి కమర్షియల్ పంథాలో కథ రాసుకొన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి.