అసెంబ్లీకి హాజరవ్వకూడదని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ జరుగుతూ ఉంటే తాము మీడియా ముందు ప్రసంగాలు చేస్తామని ప్రకటించారు. ఎవరు చేస్తారు.. ఎలా చేస్తారు అన్నది అసెంబ్లీ వస్తున్నప్పుడు సాక్షి చానల్ చూసే వారికి అర్థమవుతుంది. అయితే శాననమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకి మెజార్టీ ఉంది. ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణకు గుర్తింపు ఉంది. అందుకే హాజరు అవుతామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైసీపీ ఎమ్మెల్సీల్లోఅత్యధిక మంది సైలెంటుగా గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. నలుగురు వరకూ రాజీనామా లేఖలు ఇచ్చారు. వారు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. వచ్చినా చాలా మంది టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనకు వెళ్లారు. సమావేశాల లోపు వస్తారో లేదో స్పష్టత లేదు. ఆయన రాకపోతే మరింత గందరగోళంగా వైసీపీ పరిస్థితి ఉంటుంది.
బాయ్ కాట్ చేస్తే అన్ని సభలు బాయ్ కాట్ చేయాలని తమకు బలం ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా ఉండటం ఏమిటన్న విమర్శలు సహజంగానే వస్తాయి. జగన్మోహనరెడ్డి సభకు హాజరు కాకపోతే కనీసం ఆయన ఎమ్మెల్యేలను అయినా పంపాలన్నా డిమాండ్ వినిపిస్తోంది. ఆయన మాటను కాదని కొంత మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు అయితే పరువు పోతుందన్న అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారు.