పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి హాజరు కాకుండా ఓ వైపు బడ్జెట్ పెడుతూంటే మరో వైపు మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా బెంగళూరులో రెస్ట్ తీసుకుంటే బాగోదని ఆయన తాడేపల్లిలోనే ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై..అసెంబ్లీకి వెళ్లవద్దని చెప్పారు. పార్టీ ఆఫీసులోనే అసెంబ్లీ ఆట ఆడుకుందామని సర్ది చెప్పారు.
మాక్ అసెంబ్లీ అంటే.. ఓ వైపు అసెంబ్లీ జరుగుతూంటే.. పోటీగా ఎమ్మెల్యేలు వేరుగా సభను నిర్వహిస్తున్నట్లుగా నటించడం. ఓ రకంగా చిన్న పిల్లలకు స్కూళ్లలో చూపించే అసెంబ్లీ నిర్వహణ లాంటిది. మాక్ అసెంబ్లీ అని ఎమ్మెల్యేలుమాత్రమే పాల్గొన్న సభను అనొచ్చు. వైసీపీలో ఇప్పుడు పదకొండుమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ తో కలిపి వారిలో పెద్దిరెడ్డి కూడా ఒకరు.
మాక్ అసెంబ్లీలో జగన్ రెడ్డి సీఎం అయితే పెద్దిరెడ్డి ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తారు. మిగతా వారంతా శాఖలు పంచుకుని నిర్వహిస్తారేమో. అయితే ఇది అయినా సీరియస్ గా చేస్తారా.. కామెడీగా చేసుకుంటారా అన్నది వైసీపీ వర్గాల్లో ఉన్న సందేహం. అసలు విషయం ఏమిటంటే.. ఈ రోజు పసలు బడ్జెట్ ప్రసంగం జరుగుతుంది. తర్వాత వాయిదా పడుతుంది. సభ ఏమీ జరగదు. కానీ మాక్ అసెంబ్లీలో కూడా మాక్ బడ్జెట్ ప్రవేశ పెడతారేమో చూడాల్సి ఉంది.