రాయలసీమకు కియా కంటే అతి పెద్ద పెట్టుబడిని తీసుకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే ప్రకటన ఉంటుందని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారు. అయితే రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్న కంపెనీ ఏదో ఇంత వరకూ బయటకు రాలేదు. రాయలసీమను ఆటోమోబైల్ హబ్‌గా చేసేందుకు గతంలో టీడీపీ ఉన్నప్పుడు ప్రయత్నించారు. కియా లాంటి పరిశ్రమ వచ్చినప్పుడు.. అతి వేగంగా ఆటోమోబైల్ రంగం అభివృద్ధి చెందాల్సి ఉంది.
కానీ తర్వాత వచ్చిన జగన్ నిర్వాకం కారణంగా అనుబంధ పరిశ్రమలు కూడా రాలేదు. వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోయాయి. పదేళ్ల కాలంలో అనంతపురంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అసలు రాయలసీమలోనే రాలేదు. శ్రీసిటీలో కొన్ని పరిశ్రమలు తమ యూనిట్లను విస్తరిస్తే అదే గొప్ప అనుకున్నట్లుగా ప్రచారం చేశారు. హీరో కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైకుల యూనిట్ ప్రారంభించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు రాయలసీమ కోసం మరోసారి టీడీపీ ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తోంది.
ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తోంది. ఎన్నికలకు ముందు ఈ అంశంపై చర్చించేందుకు ఎలాన్ మస్క్ ఇండియాకు రావాల్సి ఉంది. కానీ అప్పట్లో వాయిదా వేసుకున్నారు. తర్వాత ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల్లో బిజీ అయిపోయారు. ఆయన ఫక్తు వ్యాపారవేత్త. ఎక్కడ లాభం వస్తుందనుకుంటే అక్కడ ప్లాంట్ పెడతారు. ఇటీవల నారా లోకేష్ అమెరికా పర్యటనలో టెస్లా హెడ్ క్వార్టర్స్ ను కూడా సందర్శించారు. అక్కడి వైస్ ప్రెసిడెంట్స్‌కు ఏపీ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండియాకు వచ్చినప్పుడు తమ రాష్ట్రంలో కూడా పర్యటించాలని కోరారు.
అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయేమో తెలియదు కానీ.. టెస్లా ఏపీ విషయంలో ఆసక్తి చూపితే రాయలసీమకు తిరుగు ఉండదు. కియా ఇప్పటికే అద్భుతంగా నిలదొక్కుతుంది. టెస్లా కూడా వస్తే ఆటోమోబైల్ హబ్ అయిపోతుంది.