నాగచైతన్య – సాయి పల్లవి కాంబోలో రూపొందుతున్న క్రేజీ సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా కథకు ‘మున్నీటి గీతలు’ అనే నవల ఆధారమని, ఈ రెండు కథలకూ పోలిక ఉందని తెలుగు 360 ఇది వరకే వెల్లడించింది. దీనిపై గీతా ఆర్ట్స్ అధికారికంగా స్పందించింది. తెలుగు 360 ఆర్టికల్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ భాను తెలుగు 360తో మాట్లాడుతూ ”శ్రీకాకుళం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది మత్యకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశాం. మేం ఆ మత్యకారుల్ని సంప్రదించాం. వాళ్లతో మాట్లాడాం. లైఫ్ టైమ్ రైట్స్ కూడా తీసుకొన్నాం. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల హక్కులు మా దగ్గరే ఉన్నాయి. 2020లో కార్తీక్ అనే రచయిత ఈ కథ రాసి, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. మున్నీటి గీతలు అనే నవల 2022లో రాశారు. రెండు నేపథ్యాలూ ఒక్కటే కావడంతో నవలా రచయిత శ్రీనివాసరావుకి నోటీస్ ఇచ్చాం. ‘పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్‌తో స్ఫూర్తితో రాసుకొన్నా. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరిగాయి. ఈ రెండు కథలకూ సంబంధం లేదు’ అని ఆ రచయిత స్పష్టం చేశారు. న్యూస్ పేపర్ కటింగ్స్, వార్తల ఆధారంగా ఎవరైనా ఏమైనా రాసుకోవొచ్చు. కాబట్టి మేం కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా రెండింటి నేపథ్యాలూ ఒక్కటే అయినా, కథలు మాత్రం వేరు. మేమేదో నవలని కాపీ కొట్టామని వార్తలు వస్తున్నాయి. కానీ.. వాటి హక్కులు మా దగ్గర ఉన్నాయి” అని క్లారిటీ ఇచ్చారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘మున్నీటి గీతలు’ నవలా హక్కులు ప్రముఖ దర్శకుడు క్రిష్ దగ్గర ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఆయన ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ కూడా క్రిష్ ని సంప్రందించి, ఈ విషయంలో ఓ క్లారిటీ తీసుకొన్నట్టు తెలుస్తోంది. సో.. ప్రస్తుతానికి ఈ కాపీ గొడవ సద్దుమణిగినట్టే అనుకోవాలి.