ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే.. ఇప్పుడు అనేక చాయిస్‌లు ఉన్నాయి. విశాఖ అభివృద్దిలో నెంబర్ వన్ గా ఉంటుంది. సాఫ్ట్ వేర్ హబ్‌గా మారే అవకాశం ఉంది. బోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైతే ఇక తిరిగి చూడాల్సిన పని ఉండదు. ఇక అమరావతిలో రియల్ భూమ్ సహజంగానే ఉంటుంది. తిరుపతిలో ఇల్లు ఉండటం అంటే మంచి ఆస్తి చేతిలో ఉన్నట్లేనని ఇప్పటికే చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇవన్నీ కాకుండా.. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కూడా మంచి లాభదాయమైన పెట్టుబడి ప్రాంతంగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన ఖాయమని తేలిన తర్వాత ఎక్కువ మంది ముందూ వెనుకా చూడకుండా దొనకొండలో భూములు కొన్నారు. 2014లో జగన్ సీఎం అయితే దొనకొండనే రాజధానిగా ఖరారు చేసేవారన్న ప్రచారంతో ఓ వర్గం నేతలు. విస్తృతంగా పెట్టుబడులు పెట్టి భూములుకొన్నారు. కానీ భిన్నంగా జరిగింది. తర్వాత 2019లో జగన్ గెలిచినప్పుడు ఎక్కువ మంది మళ్లీ భూములు కొన్నారు. కానీ జగన్ విశాఖ అన్నారు. దాంతో దొనకొండలో పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోలేదు కానీ.. పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆదాయం మాత్రం కళ్ల జూడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ దొనకొండలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల హడావుడి కనిపిస్తోంది.
ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు రెడీగా ఉంచింది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబు, లోకేష్ పట్టుదలతో పరిశ్రమల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. తయారీ రంగానికి ప్రకాశం జిల్లాకు భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుండే కొంత మంది భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు అక్కడ అనువైన ప్రాంతం ఇంకా ఏర్పడలేదు. అందుకే ఎకరాల్లో కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ధరలు కూడా అంత ఎక్కువగా లేవు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టిన వారు మనీ రొటేషన్ కు అయినాక కాస్త వడ్డీలు చూసుకుని అమ్ముకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పటికిప్పుడు పెట్టుబడి పెట్టి.. ఓ మూడు, నాలుగేళ్లు ఎదురు చూడగలిగేలా ఉంటే.. దొనకొండలో పెట్టుబడులకు మంచి రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.