ఒక్ర వ్యక్తి వందల సోషల్ అకౌంట్లను క్రియేట్ చేస్తాడు. వాటితో ఫేక్ పోస్టులు పెడతాడు. తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా కేంద్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.కానీ ఎలాంటి నియంత్రణ లేని సోషల్ ఖాతాల వల్ల ఆ జాగ్రత్తలన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి. తప్పుడు సమాచారం పరిధులు దాటి ఇప్పుడు రంకులు అంటగట్టడం దగ్గర నుంచి ఎవరు.. ఎవరికి పుట్టారు అన్నది చర్చించేందుకు కూడా వెనుకాడనంతటి సైకోలు పుట్టుకొచ్చారు. వారిని ఆపాలాంటే.. సోషల్ మీడియాపై నియంత్రణ ఖచ్చితంగా అవసరమే.
అకౌంటబులిటీ ఉండాలి !
ఎవరో బూచోడు అకౌంట్ ఓపెన్ చేస్తాడు. టార్గెటెడ్ గా కొంత మందిపై బురద చల్లుతాడు. కేసులు అయ్యేసరికి అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంటాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతా పని చేయాలి. ఇలాంటి పరిస్థితి ఎందుకు ?. అత్యంత ప్రభావ వంతంగామారిన సోషల్ మీడియా అకౌంట్స్ కు అకౌంటబులిటీ ఉంటే.. ఈ పరిస్థితి రాదు. ఈ పరిస్థితి ఉండాలంటే.. ప్రతి వ్యక్తికి ఒక్క అకౌంట్ మాత్రమే ఉండేలా నియంత్రించాలి. దాన్ని ఆధార్ కార్డుకు జత చేయాలి. ప్రజాస్వామ్య అద్దంగా నియమనిబంధనలు పెట్టాలి. అప్పుడు మాత్రం దుర్వినియోగాలకుతక్కువ అవకాశం ఉంటుంది.
ఫేక్ అకౌంట్లు లేకుండా చేయాలి !
సోషల్ మీడియా మన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉన్న గొప్ప ఫ్లాట్ ఫామ్.కానీ దాన్ని ఏం చేస్తున్నారు ?. ఇన్ ప్లూయన్సర్ల పేరుతో మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వందల అకౌంట్లతో ఫేక్ ట్రెడింగ్ లు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు కొంత మంది వ్యక్తిత్వ హననాన్ని చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా నేరం. వ్యవస్థీకతంగా ఇలాంటి నేరాలు జరగడానికి కారణం ఫేక్ అకౌంట్లే. ఫేక్ అకౌంట్లు లేకుండా చేస్తే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది.
సోషల్ సైకోలను నివారించడమే మార్గం !
ప్రతి దానికి మంచి చెడూ ఉంటాయి. మంచేదో.. చెడేదో ఎవరూ చెప్పలేరు. తప్పు చేసే వాడు కూడా తాను తప్పు చేయలేదని వాదిస్తారు. ఎవరి కోణంలో వారు చూస్తారు.అయితే ఇక్కడ సమాజానికి మేలు చేస్తున్నారా.. కీడు చేస్తున్నారా.. సభ్య సమాజానికి తలవంపులు తెస్తున్నారా అన్నది చూసుకుని ఆ సైట్లను నియంత్రించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను ఇక పూర్తిగా అరికట్టలేరు. ఎందుకంటే క్యాన్సర్ కన్నా వేగంగా అతి పాకిపోయింది. ఇప్పుడు దాన్ని నియంత్రించడం..నివారించడమే మార్గం. అది కూడా ప్రజాస్వామ్య మద్దతుల్లో చేయాల్సి ఉంది.