కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవక ముందు నుంచి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఓ మాట చెబుతూ ఉండేవారు. తాను ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకు వస్తానని ఇప్పుడు కల్వకుంట్ల రాజ్యం నడుస్తోందని ఆయన అనే వారు. అన్నట్లుగానే ఆయన అధికారం చేపట్టిన తర్వాత రాజ్య హింస, అణచివేత తగ్గిపోయింది. కానీ అది మరీ ఎక్కువైపోయిందని తాజాగా కలెక్టర్ పై దాడి ఘటనతో నిరూపితమయింది. మరి రేవంత్ తాను అన్న మాటలకు.. చేతలకు మధ్య గీత ఉండాలని నిర్ణయించుకునేకు సిద్ధమవుతున్నారా?
ప్రజలు కలెక్టర్‌పై దాడిచేస్తారా ?
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్ పై చేసిన దాడి వ్యూహాత్మకం. ప్రత్యేకంగా కలెక్టర్ ను పిలిపించుకుని మరీ వెళ్లి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని అక్కడి పరిణామాలను బట్టి అర్థమైపోతుంది. పక్కాగా వీడియో దృశ్యాలను రెడీచేసుకున్నారు. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయబోతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించలేకపోయాయి. దాడి జరిగిపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రజులు దాడులు చేస్తున్నారని చెప్పుకునేందుకు ఇలాంటి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. దానికి తెలంగాణ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
రాజకీయ కుట్రలు లెక్కలేనన్ని !
తాము స్వేచ్ఛ ఇచ్చామని అందుకే ప్రజలంతా తమ తమ సమస్యలను నిర్భీతిగా చెప్పుకుంటున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్య ఆందోళనలకు తాము అవకాశం ఇస్తున్నామని గత కేసీఆర్ పాలనకు.. ఇప్పటి ప్రజాపాలనకు ఇదే తేడా అని రేవంత్ రెడ్డి బలంగా చెబుతున్నారు. అది నిజం కూడా. గతంలో ధర్నా చౌక్ ను కూడా ఎత్తేశారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ధర్నాలు చేసుకునే అవకాశాల్ని కల్పించారు. కానీ రాజకీయంగా ప్రభుత్వాన్ని టార్గెటెడ్‌గా బద్నాం చేసేందుకు చేస్తున్న వాటిని నియంత్రించకపోతే ప్రభుత్వానికే సమస్యలు వస్తాయని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది.
రేవంత్ ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిందే!
ప్రజలు నిరసనలు చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు. కానీ ఆ నిరసనల రూపంలో అధికారులపై.. ప్రభుత్వంపై దాడులు చేయడం మాత్రం రాజకీయ కుట్రే అవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఓ విధానంతో ఉన్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రజలకు కల్పించాలని అనుకున్నారు. కల్పించారు.కానీ ఆ హక్కుల్ని దాడులుగా మారుస్తున్న రాజకీయాన్ని ఆయన అర్థం చేసుకోకపోతే మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.