నాకు టీడీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని జగన్ రెడ్డి చెప్పుకున్నప్పుడల్లా వైసీపీ లీడర్లు, క్యాడర్ కూడా జగన్ వైపు జాలిగా చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్లు, క్యాడర్లు ఎలా నవ్వుకుంటూంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్ రెడ్డిని ఒక అది.. ఒక ఇది అని పొగిడిన వారంతా.. ఇప్పుడు తమ నేత టీడీపీ ఇచ్చే ప్రతిపక్ష హోదా కోసం బతిమాలుకోవడం ఏమిటన్న ప్రశ్న వారిలో సహజంగానే వస్తోంది.
తాము తల్చుకుంటే చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా పీకేస్తామని.. ఇంటి ముందు ఒక్క పోలీస్ పోస్టు కూడా ఉండదని కొడాలి నాని వంటి వారితో బెదిరింపచేసిన ఘటనలు గుర్తుకు తెచ్చుకుంటే జగన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా లేదన్న సంగతిని పదే పదేచెప్పుకునేందుకు అసలు ఆసక్తి చూపరు. కానీ ఆయన ప్రజలు తనపై జాలి చూపించాలని అనుకుంటున్నారు. అందుకే తాను కోట్లు పెట్టి ప్రచారం చేయించుకున్న హీరోయిజాన్ని కూడా కామెడీ చేసుకుని ప్రతిపక్ష నేతహోదా అంటూ పోరాటం చేస్తున్నారు. ఆయన తీరు చూసి ఈయనేనా ఎన్నికలకు ముందు ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఓ బటన్ నొక్కిన సభలో ప్రకటనలు చేసింది అని ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి రూల్స్ ప్రకారం జగన్ రెడ్డికి ఆ హోదా దక్కదు. దానిపై వారికి స్పష్టత ఉంది. గత పదేళ్లుగా కేంద్రంలో ఈ కారణంగానే ప్రధాన ప్రతిపక్ష నేత లేరు అనే సంగతి వారికి తెలుసు. వారికి సుప్రీంకోర్టుకు వెళ్లినా అనుకూల తీర్పు రాలేదు. ఇంత జరిగిన తర్వాత తాము ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాటం చేయడం అంటే అంత కంటే తెలివి తక్కువ పని ఉండదని వారికి తెలియక కాదు. కానీ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని అందరికి తెలియచేస్తున్నారన్నమాట.
వాస్తవంగా అయితే హోదాను జాలి తలచి టీడీపీ ఇస్తామన్న సరే మాకు వద్దు అని చెప్పాల్సిన ఇమేజ్ ను జగన్ సృష్టించుకున్నారు. కానీ ఆయన ఇవ్వము అంటే.. ఇవ్వాల్సిందే అని చిన్న పిల్లాడు అలిగినట్లుగా అలుగుతున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. జగన్ రెడ్డి మనస్థత్వాన్ని చూసి వైసీపీ క్యాడర్ కూడా నిర్వేదం చెందే పరిస్థితి కనిపిస్తోంది.