ఏ పార్టీ అయినా సోషల్ మీడియా సైన్యాన్ని అబిమానులతో ఏర్పాటు చేసుకుంటాయి. వారితో తప్పుడు పనులు చేయించవు. ఎందుకంటే పార్టీ కోసం పని చేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని పార్టీలు కూడా భావిస్తాయి. కానీ వైసీపీ భిన్నం. తమ కోసం పని చేసేవారిని నాశనం చేసి అయినా తాము బాగుపడాలని ఆ పార్టీ హైకమాండ్ అనుకుంటుంది. దానికి తాజా సాక్ష్యం డిజిటల్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ పేరుతో సోషల్ మీడియా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి తప్పుడు పనులు చేయించారు.
సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధిక మంది ఐదేళ్లుగా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని డీఐజీ ప్రవీణ్ కోయ కూడా చెప్పారు. వారి డిజిటల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా చేసిన ఉద్యోగం ఏమీ లేదు. సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే. పార్టీ పని కోసం ప్రజాధనంతో సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలిచ్చారని తాజాగా ఈ కేసులో బయటపడినట్లయింది. ఇలా జీతాలు తీసుకున్న వారు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనా తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తించారు. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంటెంట్ కార్పొరేషన్ పేరును డిజిటల్ కార్పొరేషన్ గా ఐ డ్రీమ్ యూట్యూబ్ చానళ్ల యజమాని చిన్న వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని దీనికి చైర్మన్ గా నియమించారు. ఈ కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అయితే నియామకాల గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ కింద జీతాలు చెల్లించినట్లుగా తాజాగా వెలుగులోకి రావడంతో ఈ స్కామ్ మొత్తం బయటకు లాగే అవకాశాలు ఉన్నాయి.
నేరుగా ఈ స్కామ్ తాడేపల్లికి చేరుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న వాసుదేవరెడ్డి వైసీపీ ఓడిపోయిన తర్వాత కనిపించడం లేదు. ఆయన అమెరికా పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.