హైదరాబాద్‌లో ట్రంప్ అడుగు పెట్టబోతున్నారు. అయితే ముందుగా ఆయన బ్రాండ్ రాబోతోంది. ఆయన తన నాలుగేళ్ల పదవీ కాలంలో ఇండియాలో పర్యటిస్తారో లేదో.. పర్యటించినా హైదరాబాద్‌కు వస్తారో లేదో తెలియదు కానీ.. ఆయన కంపెనీ ట్రంప్ టవర్స్ మాత్రం బ్రాండ్ ను ఉపయోగించుకుని సొమ్ము చేసుకునేందుకు రెడీ అవుతోంది. లోకల్ కంపెనీ మంజీరా కంపెనీతో కలిసి ఆయన మాదాపూర్ ఏరియాలో అతి పెద్ద ట్రంప్ టవర్స్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ట్రంప్ వ్యాపారాల్లో అత్యంత కీలకమైనవి ఈ ట్రంప్ టవర్స్ నిర్మాణాలు. హౌసింగ్ ప్రాజెక్టులు తక్కువ. క్యాసినోలు, హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు వంటి నిర్మాణాలు ఎక్కువ. అయితే హైదరాబాద్ లో మాత్రం మంజీరాతో కలిసి చేపట్టబోయే ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజక్టే. రెండు టవర్స్ ను అత్యంత లగ్జరీగా అమెరికన్ స్టైల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే మూడేళ్ల కిందట హెచ్ఎండీఏ వేలంలో 2.7 ఎకరాలను మంజీరా, ట్రంప్ కంపెనీ కలిసి కొనుగోలు చేశాయి. త్వరలో నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది.
ట్రంప్ టవర్స్ ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో ఇతర మెట్రో నగరాల్లో కూడా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఇతర చోట్ల భారీ మాల్స్, హోటల్స్, గోల్ఫ్ కోర్సులు నిర్మిస్తారని అంటున్నారు. అయితే ఇతర చోట్లా మంజీరా సంస్థను కాకుండా మరో సంస్థను పార్టనర్ గా ఎంచుకున్నారు.
ట్రంప్ ఇప్పుడు వ్యాపారాలపై దృష్టి పెట్టగలరో లేదో కానీ ఆయన వారసులు మాత్రం.. ఆయనకు వచ్చిన ఫేమ్‌తో ఎలా డబ్బులు సంపాదించాలా అన్నది మాత్రం.. బాగా స్టడీ చేసి దానికి తగ్గట్లుగా అడుగులు వేస్తున్నారు.